ఫేస్‌బుక్కా? ఫేక్‌బుక్కా?

10 Jul, 2017 15:22 IST|Sakshi
ఫేస్‌బుక్కా? ఫేక్‌బుక్కా?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నెలకొన్న మత ఉద్రిక్తతలకు సోషల్‌ మీడియాలో, ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలు ఆజ్యం పోస్తున్నాయి. ఓ భోజ్‌పురి సినిమాలో ఓ యువతి పైట లాగుతున్న దృశ్యాన్ని పోస్ట్‌ చేసి మత ఘర్షణలు చెలరేగిన 24 పరిగణాల జిల్లాలో ఓ హిందూ యువతి పైటలాగుతున్న ముష్కరలు అంటూ కామెంట్‌ పెట్టారు. ఆ దృశ్యంలో యువతి మేకప్‌ వేసుకొని ఉండడం, పిల్లలు, పెద్దలంతా కలసి ఆ దృశ్యాన్ని చూస్తుంటే అది సినిమా షూటింగ్‌ లేదా సినిమాలో స్టిల్‌ అని కచ్చితంగా అర్థమవుతుంది. ఎవరో ఆకతాయి చేసిన ఈ పోస్ట్‌ను సాక్షాత్తు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌ వర్గియా సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ చేయడం ఆశ్చర్యం కలిగించింది.

మొహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద చిత్రాన్ని వేసి ప్రస్తుత బెంగాల్‌ మత ఉద్రిక్తతలకు కారణమైన యువకుడి తల్లిదండ్రులను 24 పరిగణాల జిల్లాలోని బడూరియాలో ఎలా హింసించారో చూడండి అంటూ ఫేస్‌బుక్‌లో మరో చిత్రాన్ని పోస్ట్‌చేసి కామెంట్‌ రాశారు. అసలు ఆ యువకుడికి తల్లే లేదని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. పైగా ఆ చిత్రం బంగ్లాదేశ్‌లో 2014లో జరిగిన ఓ గొడవకు సంబంధించినదని ఆన్‌లైన్‌లో తప్పుడు వార్తలను వెతికిపట్టుకొనే సైట్‌ ‘ఆల్ట్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌’ వెల్లడించింది.

ఒకప్పుడు శాంతి, సౌభ్రాతత్వాలు విరాజిల్లిన బెంగాల్‌ నేడు అన్ని రంగాల్లో విఫలమైందన్న వ్యాఖ్యలతో ఆటోట్రాలీ తగులబడుతున్న దశ్యాన్ని పోస్ట్‌ చేశారు. ఈ తగులబడుతున్న దశ్యం ఈనాటిది కాదు. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించినది. దీన్ని బీజీపీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్‌ ఫేక్‌బుక్‌గా మారుతోందని, తాను ఫేస్‌బుక్‌ను ఎంతైనా ప్రేమిస్తానని, ఫేక్‌బుక్‌ను ద్వేషిస్తానని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు.

మరిన్ని వార్తలు