వృద్ధాప్యంలో దర్జా జీవితం

30 Nov, 2013 00:32 IST|Sakshi
వృద్ధాప్యంలో దర్జా జీవితం

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యుగంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడటం చాలా తక్కువైపోతోంది. తల్లిదండ్రులతో కలిసుండే కుటుంబాల కన్నా ఉద్యోగాల రీత్యా, ఇతరత్రా కారణాల రీత్యా వేరువేరుగా ఉండేవారే ఎక్కువవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కోరుకుంటున్నదొక్కటే. మలిసంధ్యలో ఏ బాదర బందీ లేకుండా ప్రశాంతంగా ఉండాలని. ఇలా కోరుకునేవారికి పరిష్కారం చూపిస్తున్నాయి ‘రిటైర్మెంట్ హోమ్స్’. వృద్ధులకు ఆపన్నహస్తం అందించడానికి నిర్మాణ రంగంలో ఊపిరి పోసుకున్న ఈ సరికొత్త పోకడతో వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆరోగ్యం, ఆనందం, విలాసంతో పాటు శాంతి, భద్రతలూ దొరుకుతున్నాయి. గతంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రోల్లోనే ఈ రిటైర్మెంట్ హోమ్స్ ఉండేవి. కానీ, ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఈ గృహాలకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ నిర్మాణ సంస్థలు, ప్రభుత్వం కూడా వృద్ధులకు సకల సౌకర్యాలతో కూడిన ప్రత్యేక ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఇటీవలే కోవై సీనియుర్ కేర్ కన్‌స్ట్రక్షన్స్, వూక్ ప్రాజెక్ట్‌ల సంయుుక్త భాగస్వావ్యుంలో ‘సెరీన్ వూక్’ పేరుతో భారీ రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్ట్ ప్రారంభవుయింది. వీటిపై సాక్షి రియల్టీ ప్రత్యేక కథనమిది...
 
 ఆహారం నుంచి ఆరోగ్యం దాకా: వృద్ధాశ్రమాలకు, రిటైర్మెంట్ హోమ్స్‌కు మధ్య తేడా ఏంటంటే.. రిటైర్మెంట్ హోమ్స్‌లో ఫ్లాట్లు కొన్నవారు లేదా అద్దెకున్నవారు మాత్రమే నివసిస్తారు. నిర్వహణ రుసుము చెల్లించి అన్ని రకాల సౌకర్యాలూ పొందుతారు. అంటే సొంతింట్లో ఉంటూ వృద్ధాశ్రమాల్లో దొరికే సామాజిక జీవనం, నాణ్యమైన సౌకర్యాలను పొందవచ్చన్న మాట. రిటైర్మెంట్ హోమ్స్‌లో వృద్ధులు వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. అపార్ట్‌మెంట్‌లోనే మెస్ ఉంటుంది. ఉదయం ఐదు గంటల కల్లా టీతో మొదలై టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, బిస్కట్లు, రాత్రి భోజనం ఇలా అన్నీ సరైన వేళల్లో అమరుస్తారు. మెస్‌కు వచ్చి భోజనం చేయలేని వారికి ప్రత్యేకించి ఫ్లాట్‌కే భోజనం సరఫరా చేస్తారు. అపార్ట్‌మెంట్‌లోనే ప్రాథమిక చికిత్సా కేంద్రం ఉంటుంది. 24 గంటలు అంబులెన్స్, రెసిడెంట్ నర్సు, డాక్టర్ అందుబాటులో ఉంటారు.
 
 కొత్త జీవితానికి నాంది: రిటైర్మెంట్ హోమ్స్‌లో నివసించేవారంతా ఒకే వయసు వారు కాబట్టి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటారు. వ్యాయామం, కబుర్లు, ఆటలు, పాటలతో కాలక్షేపం చేయవచ్చు. హాబీ సెంటర్, కమ్యూనిటీ కిచెన్, స్విమ్మింగ్ పూల్, యోగా కేంద్రాలు, ఏటీఎం సెంటర్, సూపర్ మార్కెట్, గ్రంథాలయం.. ఇలా అన్ని రకాల సౌకర్యాలుంటాయి. ఫ్లాట్‌వాసులు బృందాలుగా ఏర్పడి సంఘ సేవ, గార్డెనింగ్ చేసుకోవచ్చు. వినోదం కోసం ఇండోర్ మినీ థియేటర్, ఓపెన్ థియేటర్‌లు సైతం ఈ రిటైర్మెంట్ హోమ్స్‌లో ఉంటాయి.
 
 ఫ్లాట్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు: ఫ్లాట్ నిర్మాణం పూర్తిగా వృద్ధులకు తగ్గట్టే ఉంటుంది. మోకాళ్ల నొప్పులున్న వారికి ప్రత్యేకమైన టాయ్‌లెట్స్ ఉంటాయి. బాత్‌రూమ్, బెడ్ రూమ్, కారిడార్లలో అత్యవసర ప్యానిక్ బజర్లు, గ్రాబ్ బార్స్ ఉంటాయి. గ్రాబ్ బార్స్ సహాయంతో వృద్ధులు సులువుగా నడుస్తారు, కూర్చుంటారు కూడా. ఒకవేళ కిందపడిపోతే ఫ్లాట్‌లో ప్యానిక్ అలారం సిస్టం ఉంటుంది. దీన్ని నొక్కితే చాలు సెక్యూరిటీ దగ్గర అలారం మోగుతుంది. వెంటనే  సెక్యూరిటీ అప్రమత్తమై సంబంధిత ఫ్లాట్‌కు చేరుకొని వృద్ధులను రక్షిస్తాడు. ఇంట్లో పనులకు ప్రత్యేకించి పని మనుషులుంటారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుంటాయి. 24 గంటలూ అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాలో అపార్ట్‌మెంట్ ఉంటుంది. విద్యుత్తు వినియోగం తగ్గించడం, వ్యర్థాలను మళ్లీ వాడటం, నీటిని శుద్ధి చేయడం వంటివి నిత్యం జరుగుతుంటాయి.
 
 నగరంలో నిర్మిస్తున్న రిటైర్మెంట్ హోమ్స్ ఇవే...
     కోవై సీనియుర్ కేర్ కన్‌స్ట్రక్షన్స్, వూక్ ప్రాజెక్ట్‌ల సంయుక్త భాగస్వావ్యుంలో శ్రీశైలం హైవేలోని నాలెడ్జ్ సిటీకి చేరువలో 3 ఎకరాల్లో ‘సెరీన్ వూక్’ రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 3 ఎకరాల్లో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ 30 నెలల్లో పూర్తవుతుంది. 732 చ.అ. నుంచి 1,519 చ.అ. విస్తీర్ణంలో ఫ్లాట్లుంటాయి. రూ.20.86 లక్షల నుంచి ధర ప్రారంభమౌతుంది.
 
     కాప్రా కేంద్రంగా పనిచేస్తోన్న సాకేత్ గ్రూప్ 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రణామ్ పేరుతో రిటైర్మెంట్ హోమ్స్‌ను నిర్మిస్తోంది. ఇందులో వచ్చేవి మూడు బ్లాకులు. ఒక్కో బ్లాకులో తొమ్మిది అంతస్తులుంటాయి. ఏ-బ్లాక్‌లో 90, బీ-బ్లాక్‌లో 97, సీ-బ్లాక్‌లో 144 ఫ్లాట్లను నిర్మించారు. ఇక ధర విషయానికొస్తే ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ. 2,600లుగా ఉంది.
 
     {పొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్‌లో 11 ఎకరాల విస్తీర్ణంలో ‘సెరెన్ ప్రగతి’ రిటైర్మెంట్ హోమ్స్‌ను నిర్మిస్తోంది. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 112. ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి రూ. 28 లక్షల నుంచి రూ. 90 లక్షల ధరలున్నాయి.
 
     బండ్లగూడ రాజీవ్ స్వగృహలో వృద్ధుల కోసం ప్రభుత్వం ప్రత్యేకించి 108 సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఫ్లాట్ విస్తీర్ణం 653 చదరపు అడుగులు. ఫ్లాట్ ధర రూ.16.50 లక్షలు.

మరిన్ని వార్తలు