లెక్కల గారడీలతో జాగ్రత్త..

30 Nov, 2015 00:26 IST|Sakshi
లెక్కల గారడీలతో జాగ్రత్త..

అప్ టు 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ చూసి ఆన్‌లైన్ పోర్టల్‌లో టికెట్లు బుక్ చేసుకున్నాడు వినయ్. ఎలాగూ.. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది కదా అని  ఈ సారి స్లీపర్ క్లాస్ బస్‌లో టికెట్లు బుక్ చేశాడు. రూ. 3,000 పెట్టి విశాఖపట్నానికి రెండు టికెట్లు తీసుకున్నాడు. ఆఫర్ కింద తిరిగి రూ. 1,500 వెనక్కి వస్తాయి కదా.. ఒక టికెట్ మీద ఇద్దరు ప్రయాణం చేస్తున్నాం అని సంతోషంలో బుక్ చేశాడు. కానీ తీరా అకౌంట్‌లోకి చూస్తే క్యాష్ బ్యాక్ కింద రూ. 200 మాత్రమే వెనక్కి రావడంతో లబోదిబోమంటూ కంపెనీకి ఫోన్ చేశాడు. కాల్‌సెంటర్ వాళ్ల సమాధానం విన్న వినయ్ గుడ్లు వెళ్లబెట్టాడు. ఈ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 200 మాత్రమే వెనక్కి ఇస్తారంట. మరి 50% క్యాష్ బ్యాక్ అన్న ప్రకటన సంగతి ఏంటి అని రెట్టించి అడిగితే.... రూ. 400 టికెట్ తీసుకున్న వాళ్లకి 50% వస్తుందని, ఆ పైన మొత్తం పెరిగే కొద్ది ఈ శాతం తగ్గుతూ వస్తుందని సెలవిచ్చారు. వినియోగదారులను ఆకర్షించడానికి సంస్థలు అనుసరిస్తున్న లెక్కల గిమ్మిక్కులు ఇవి. ఇప్పుడు ఈ ఆఫర్ల సంస్కృతి  ఫైనాన్షియల్ ప్రోడక్టులకు కూడా వ్యాపించింది. పెట్టుబడి, రుణ పథకాలపై విధ కంపెనీలు అనుసరిస్తున్న గిమ్మిక్కు ప్రచారాలపై అవగాహన కల్పించేదే ఈ కథనం.
 
అధిక రాబడి, సున్నా శాతానికే రుణాలు వంటి ప్రకటనలు మనకు తరుచూ కనిపిస్తూనే ఉంటాయి. తీరా వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఇవి భిన్నంగా ఉంటాయి. పైకి కనపడని ఎన్నో చార్జీలు, షరతులు వాస్తవ రాబడిని తగ్గించేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రచారంలో ఉన్న వివిధ మార్కెటింగ్ ప్రచార పథకాలు, వీటిల్లో ఉండే జిమ్మిక్కులను ఇప్పుడు పరిశీలిద్దాం..
 
రుసుములు లేకుండా క్రెడిట్ కార్డు

 ఈ మెయిల్ ఓపెన్ చేయగానే లేక తరుచు మొబైల్స్‌కు ఇటువంటి మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. వీటికి ఆశపడి వెంటనే దరఖాస్తు చేసుకోవద్దు. అసలు ఎటువంటి రుసుములు లేకుండా జీరో కాస్ట్‌కే కార్డును ఎందుకిస్తున్నాయన్న విషయం పరిశీలించండి. ఇది తెలియాలంటే ముందు జీరో కాస్ట్ వర్తించాలంటే కంపెనీ పెట్టిన నియమ నిబంధనలను తప్పక చూడాలి. సాధారణంగా ఈ ఆఫర్ కింద కార్డులు ఇస్తున్నప్పుడు మొదటి ఏడాదికి ఎటువంటి రుసుములు వసూలు చేయవు. అలా కాకుండా జీవితాంతం ఎటువంటి రుసుములు వసూలు చేయము అని చెపితే దానికి తప్పకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రతీ ఏడాది నిర్ధిష్ట మొత్తం కొన్నప్పుడు మాత్రమే వార్షిక రుసుములు రద్దు చేస్తారు. ఉదాహరణకు ఏటా కనీసం రూ. 30,000 కార్డుపై లావాదేవీలు చేస్తే వార్షిక రుసుములు రద్దు వంటి నిబంధనలుంటాయి.

9 శాతానికే పర్సనల్ లోన్స్
తొమ్మిది శాతం సింపుల్ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలు.. ఇదే ఆఖరి అవకాశం.. పర్సనల్ లోన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. వంటి ఈ మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటును 13 నుంచి 18 శాతం దాకా వసూలు చేస్తున్నాయి. అంతకంటే తక్కువ వడ్డీరేటుకి అందులో సింపుల్ వడ్డీరేటుకే ఇస్తున్నారంటే ఎవరైనా ఎందుకు కాదంటారు. కానీ ఇక్కడ వడ్డీరేటును ఏ విధంగా లెక్కిస్తున్నారన్న విషయాన్ని గమనించాలి. సాధారణంగా రుణాలపై వడ్డీరేట్లను ప్రతీ నెలా కట్టేయగా మిగిలిన మొత్తంపై  లెక్కించి ఈఎంఐని నిర్దేశిస్తారు. కానీ ఇలా తక్కువ వడ్డీరేటుకు ఆఫర్ చేసే రుణాల్లో రుణం మొత్తంపైన లెక్కిస్తారు. ఈ లెక్కన చూస్తే చివరకు ఇది ఏ 16 శాతానికో తేలుతుంది. ఇలా తక్కువ వడ్డీరేటును చూపించడం ద్వారా ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు.
 
10 శాతం బోనస్
 బీమా కంపెనీలు అధిక బోనస్‌లు ఇస్తున్నట్లు ప్రకటిస్తుంటాయి. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఆ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. బీమా కంపెనీలు బోనస్‌లను షమ్ అష్యూర్డ్ (తీసుకున్న బీమా రక్షణ మొత్తం)పై ప్రకటిస్తాయి. కానీ కొన్ని ఎండోమెంట్ పాలసీల్లో కట్టే ప్రీమియం షమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు కట్టిన ప్రీమియాన్ని లెక్కలోకి తీసుకుంటే సగటున 6 శాతం గిట్టుబాటు అవుతుంది.
 
 
నెలకు రూ.5,000తో    20 ఏళ్లలో కోటిన్నర.. ఎలా!
 ఇటువంటి ఆఫర్లు మనం ఎక్కువగా బీమా కంపెనీల్లో చూస్తుంటాం. చూడగానే ఇన్వెస్ట్ చేసేయాలన్నట్టుగా ఉంటాయివి. సామాన్యుడు ఊహించలేని కోటిన్నర రూపాయల నిధిని ప్రతీ నెలా చిన్న మొత్తంతో సమకూర్చుకోవచ్చన్నదే ఈ ఆకర్షణకు ప్రధాన కారణం. ఇలాంటి ఆఫర్లలో వాళ్లు చెపుతున్న గణాంకాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూడాలి. సాధారణంగా అధిక రాబడి రేటుతో ఈ  భారీ మొత్తాలను చూపిస్తారు. ఇందులో వార్షిక వ్యయాలు వంటి ఇతర చార్జీలను చూపించరు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ రాబడి ఇంతకంటే తక్కువగా ఉంటుంది. అంతేకాదు కనిష్ట రాబడి రేటుకు ఎంత మొత్తం వస్తుందన్న విషయం కూడా అడిగి                      తెలుసుకోండి.
 
గుర్తుంచుకోండి..
వ్యాపారంలో ఏదీ కూడా ఉచితంగా ఇవ్వరన్న
విషయం మర్చిపోవద్దు
ఏదైనా కొనేటప్పుడు లేదా ఇన్వెస్ట్ చేసేటప్పుడు
నియమ నిబంధనలు క్షుణ్నంగా చదవండి
అంకెలను చూసి మురిసిపోకుండా,
వాస్తవ రాబడులను గణించి సరిచూసుకోండి
 
 

మరిన్ని వార్తలు