భెల్ నికర లాభం 62 శాతం డౌన్

7 Apr, 2015 01:31 IST|Sakshi
భెల్ నికర లాభం 62 శాతం డౌన్

మార్కెట్ మందగమనమే
 కారణమంటున్న కంపెనీ
 
 న్యూఢిల్లీ: విద్యుత్ రంగ పరికరాలు తయారు చేసే భెల్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం క్షీణించింది. ప్రభుత్వ నియమనిబంధనల కారణంగా మార్కెట్ మందగమనంగా ఉండటమే దీనికి కారణమని వివరించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3,461 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 62 శాతం క్షీణించి రూ.1,314 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. మొత్తం టర్నోవర్ రూ.40,338 కోట్ల నుంచి రూ.30,806 కోట్లకు తగ్గిందని వివరించింది. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు లభ్యత విషయంలో అడ్డంకులు, నిధుల లభ్యత సరిగ్గా లేకపోవడం, భూ సమీకరణ, పర్యావరణ అనుమతులు, తదితర అంశాలు లాభంపై ప్రభావం చూపాయని పేర్కొంది.
 
 ఆర్డర్ బుక్ రూ. లక్ష కోట్లపైనే
 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2014-15లో వచ్చిన ఆర్డర్లు 10 శాతం వృద్ధి చెంది రూ.30,794 కోట్లకు పెరిగాయని వివరించింది.. విద్యుత్‌రంగంలో ఆర్డర్లు రూ.24,873 కోట్లుగా, పరిశ్రమల విభాగం నుంచి రూ.5,201 కోట్లుగా, ఎగుమతుల అర్డర్లు రూ.720 కోట్లుగా  ఉన్నాయని వివరించింది. మొత్తం మీద ఆర్డర్ బుక్ రూ.1,01,159 కోట్లుగా ఉందని పేర్కొంది.
 
  తెలంగాణలో ప్లాంట్: కాగా ఈ కంపెనీ  విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇటీవలనే తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5,000 కోట్లు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరులో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో ఇక్కడ విద్యుదుత్పత్తి చేయాలనేది ఈ ఒప్పందం లక్ష్యం. కాగా తెలంగాణ రాష్ట్రంలో 6,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు నిమిత్తం టీఎస్‌జెన్‌కోతో భెల్ ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని వార్తలు