‘బికినీ కిల్లర్‌’కు ఓపెన్‌హార్ట్‌ సర్జరీ

9 Jun, 2017 19:25 IST|Sakshi

ఖాట్మండూ: అంతర్జాతీయ నేరస్తుడు ఛార్లెస్‌ శోభరాజ్‌కు ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయించేందుకు నేపాల్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వివిధ నేరాల కింద గత పన్నెండేళ్లుగా అతడు ఖాట్మండూ శివారులో ఉన్న సెంట్రల్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. శోభరాజ్‌ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యుల బృందం పరీక్షలు జరిపి ఆపరేషన్‌ అవసరమని స్పష్టం చేసింది. ఖాట్మండూలోని షాహిద్‌ గంగాలాల్‌ ఆస్పత్రిలో అతడికి సోమవారం చికిత్స చేయనున్నారు. ఇందుకు అయ్యే ఖర్చునంతా నేపాలీ ప్రభుత్వం భరించనుందని వైద్యులు తెలిపారు.

భారత, వియత్నాం దంపతులకు పుట్టిన ఛార్లెస్‌ శోభరాజ్‌(73) ఫ్రెంచి పౌరుడు. బికినీ కిల‍్లర్‌గా గుర్తింపు పొందిన 1970 దశకంలో ఇతడు సుమారు 20 మందిని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. 1975లో జరిగిన అమెరికా దేశస్థురాలు కోనీ జో బ్రొన్‌జిక్‌ హత్య కేసులో ఖాట్మండూ జైలులో 2003 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. నేపాల్‌ జీవిత ఖైదు 20 ఏళ్లు ఉంటుంది. ఇతడిపై మరిన్ని కేసులుండటంతో ఖైదు ముగిసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇతడికి స్వేచ్ఛ లభించే అవకాశాలు లేవు. ఇతడి చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువమంది విదేశీ యాత్రికులే కావటం గమనార్హం.

మరిన్ని వార్తలు