ట్రంప్‌ను దగ్గరుండి ఓడిస్తా: వారెన్ బఫెట్

2 Aug, 2016 07:59 IST|Sakshi
ట్రంప్‌ను దగ్గరుండి ఓడిస్తా: వారెన్ బఫెట్

డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని, దగ్గరుండి అతడిని ఓడిస్తానని అమెరికా కుబేరుడు వారెన్ బఫెట్ చెప్పారు. నెబ్రాస్కాలో హిల్లరీ క్లింటన్‌తో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ వ్యాపార రికార్డును, దివాలా చరిత్రను ఆయన ప్రశ్నించారు. అసలు ట్రంప్ తన ఆదాయపన్ను రిటర్నులను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేనివారిని తాను దగ్గరుండి తీసుకెళ్తానని కూడా బఫెట్ తెలిపారు. నెబ్రాస్కాలో ఆ రోజు మొత్తం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా 32 సీట్ల ట్రాలీ ఒకదాన్ని రిజర్వు చేసినట్లు చెప్పారు. నెబ్రాస్కా రాష్ట్రం రిపబ్లికన్ల ఆధీనంలోనే ఉన్నా, 2008 ఎన్నికల్లో ఇక్కడ బరాక్ ఒబామాకు ఆధిక్యం లభించింది.

అక్కడ ఒమాహా సహా మిగిలిన శివారు ప్రాంతాల్లో హిల్లరీ క్లింటన్ ప్రచారం చేశారు. ఈ ప్రాంతంలోనే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా ఓ ముస్లిం - అమెరికన్ కుటుంబం ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో అక్కడ వారికి, ట్రంప్‌కు మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది. ఖిజర్, ఘజేలా ఖాన్ దంపతుల కుమారుడు అమెరికా సైన్యంలో పనిచేస్తూ.. 2004లో ఇరాక్‌లో మరణించాడు. అయితే ఈ కుటుంబ త్యాగాన్ని ట్రంప్ తక్కువ చేసి మాట్లాడారని బఫెట్ మండిపడ్డారు. తటస్థంగా ఉన్న, స్వతంత్రంగా వ్యవహరించే ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారెన్ బఫెట్ సహా  మరికొందరు వ్యాపారవేత్తలు గత సంవత్సరమే క్లింటన్‌కు మద్దతు పలికారు. ట్రంప్ తన కేసినోను, హోటల్ కంపెనీని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజిలో 1995లోనే లిస్ట్ చేశారని, దాంతో మదుపుదారులు తమ పెట్టుబడులు నష్టపోయారని బఫెట్ చెప్పారు.

మరిన్ని వార్తలు