జీటీఏ సీఈవో బిమల్ గురుంగ్ రాజీనామా

30 Jul, 2013 22:00 IST|Sakshi
జీటీఏ సీఈవో బిమల్ గురుంగ్ రాజీనామా
తెలంగాణ రాష్ట్రానికి తాము అనుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించడంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గూర్ఖాలాండ్ ఉద్యమం మరింత ఊపందుకుంది. గూర్ఖాలాండ్ టెర్రిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ సీఈవో బిమల్ గురుంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ప్రకటించాలంటూ ఆయన తన రాజీనామాను సమర్పించారు. తన రాజీనామాను పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి కూడా ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నట్లు గూర్ఖా జనముక్తి మోర్చా వర్గాలు తెలిపాయి. అయితే లేఖలో ఆయన ఏం రాసినదీ మాత్రం ఇంకా తెలియరాలేదు.  
డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లోని బోర్డింగ్ పాఠశాలల విద్యార్థులు, పర్యాటకులు రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరారు. గూర్ఖాలాండ్కు మద్దతుగా జీజేఎం సోమవారం నుంచి మూడురోజుల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని నిరవధిక నిరసనగా మార్చాలని జీజేఎం నిర్ణయించింది. కాగా, కలింపాంగ్ పట్టణంలోని డంబ్రాచౌక్ ప్రాంతంలో జీజేఎం మద్దతుదారుడు ఒకరు ఆత్మాహుతి చేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్లు చూసి మంటలు ఆర్పేసరికే 90 శాతం కాలిన గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. బంద్ కారణంగా డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారింది. దుకాణాలు, మార్కెట్లు, పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు అన్నీ మూతపడ్డాయి. 
మరిన్ని వార్తలు