నోట్ల రద్దు: ఆ భూ ఒప్పందాల మర్మమేమిటి?

26 Nov, 2016 12:13 IST|Sakshi
నోట్ల రద్దు: ఆ భూ ఒప్పందాల మర్మమేమిటి?

పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పెద్ద నోట్ల రద్దుకు కొద్దిరోజుల ముందే బిహార్‌లో బీజేపీ నేతలు పార్టీ కార్యాలయాల కోసం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంపై దుమారం రేగుతోంది. పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌ నుంచి తప్పించుకోవడానికే బీజేపీ నేతలు ఇలా భూములు కొనుగోలు చేశారని, అత్యంత గోప్యంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు గురించి బీజేపీ నేతలకు ముందే తెలిసిందని, అందుకే పార్టీ కార్యాలయాల కోసం ఉద్దేశించిన భూముల కొనుగోళ్లను గత ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ముందు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారని అధికార జేడీయూ ఆరోపించింది.

పార్టీ కార్యాలయాల కోసం 23 భూ ఒప్పందాలను బీజేపీ కుదుర్చుకుంది. ఇందులో ఎక్కువశాతం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో జరగడంతో ఈ అంశాన్ని జేడీయూ అస్త్రంగా వాడుకొని కమలదళాన్ని ఇరకాటంలో నెట్టాలని చూస్తోంది. ‘పెద్దనోట్ల రద్దు గురించి వారికి ముందే తెలుసు. అందుకే ఆగస్టు, సెప్టెంబర్‌లలో భూ ఒప్పందాలు చేసుకున్నారు’ అని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ రేటు కన్నా తక్కువ ధరకు వీటిని రిజిస్టర్ చేయించుకున్నారని, దీనిపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ బిహార్‌ శాఖ కొట్టిపారేస్తున్నది. ఈ ఒప్పందాలన్నీ చెక్కుద్వారానే జరిగాయని, ఇందులో బ్లాక్‌ మనీ ప్రమేయమే లేదని బిహార్ బీజేపీ చీఫ్‌ మంగళ్‌ పాండే తెలిపారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సూచనలమేరకు పార్టీ యూనిట్లన్నీ కార్యాలయాలు సమకూర్చుకోవడానికి చాలాకాలంగా భూ కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాయని, ఆ ప్రక్రియ ఇటీవల ముగియడంతో ఇటీవల రిజిస్ట్రేషన్లు జరిపించినట్టు ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు