20 అడుగుల లోతు గొయ్యిలో పాతిపెట్టారు

9 Nov, 2015 11:58 IST|Sakshi
20 అడుగుల లోతు గొయ్యిలో పాతిపెట్టారు

ముంబై: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీజేపీపై మిత్రపక్షం శివసేన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. నితీశ్ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తింది. ప్రజలను ఒకసారి మాత్రమే మోసం చేయగలమని బిహార్ ఫలితాలు రుజువు చేశాయని  'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను తేలిగ్గా తీసుకున్న బీజేపీ- బిహార్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుందని... మోదీ వర్సెస్ నితీశ్ గా ముఖాముఖి పోరు జరిగిందని పేర్కొంది. రాజకీయ వ్యూహాలు, డబ్బు, భారీ ప్యాకేజీ ప్రకటనలు చేసినా బీజేపీ 60 సీట్లు కూడా సాధించలేకపోయిందని ఎద్దేవా చేసింది. ఎన్డీఏ మిత్రపక్షాలను బిహార్ ఓటర్లు 20 అడుగుల లోతు గొయ్యిలో పాతిపెట్టారని దుయ్యబట్టింది.

నిరాడంబర ప్రచారం, హానెస్ట్ ఇమేజ్ తో నితీశ్ అధికారం నిలబెట్టుకున్నారని తెలిపింది. బూటకపు హామీలు ఇవ్వలేదని, అనాగరిక భాష వాడలేదని, డబ్బు, అధికారం వినియోగించలేదని... ఇవన్నీ నితీశ్ విజయానికి బాటలు వేశాయని విశ్లేషించింది.

మహాకూటమి గెలిచిన తర్వాత పాకిస్థాన్ లో టపాసులు పేలాయే, లేదో తమకు తెలియదని శివసేన వ్యాఖ్యానించింది. బిహార్ ఎన్నికల ఫలితాలకు బీజేపీ కచ్చితంగా ఎదురుదెబ్బేనని పేర్కొంది. వినమ్రత అనేది ఆభరణం కాదని ఆత్మరక్షణ ఆయుధం అనీ బిహార్ ఫలితాలతో రుజువయిందని తెలిపింది.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా