ఆ పత్రికను నిషేధించండి

16 Feb, 2017 11:19 IST|Sakshi
ఆ పత్రికను నిషేధించండి
శివసేన అధికారిక పత్రిక అయిన సామ్నాపై మూడు రోజుల నిషేధం విధించాలని మహారాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కోరింది. దాంతో మహారాష్ట్రలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితిని సృష్టిస్తున్నారంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు ప్రచారం చేసేలా ఆ పత్రికలో ముద్రించినందున పత్రికను ఫిబ్రవరి 16, 20, 21 తేదీలలో నిషేధించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్వేతా షాలిని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని 10 కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్‌లకు ఫిబ్రవరి 16, 21 తేదీలలో రెండు దశలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సామ్నాపై నిషేధం విధించాలని కోరారు. 
 
అయితే.. సామ్నాను మూసేయడం ఎప్పటికీ సాధ్యం కాదని ఉద్ధవ్ ఠాక్రే పుణెలో ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరాగాంధీని బీజేపీ తప్పుబట్టిందని, మరి ఇది మాత్రం ఎమర్జెన్సీ కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్న ప్రాంతాలకు ప్రచారం కోసం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎందుకు వెళ్తున్నారన్నారు. అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం ప్రధామంత్రి, ముఖ్యమంత్రి ప్రచారం చేయకూడదని చెప్పారు. 
మరిన్ని వార్తలు