ముంబై, థానె మినహా.. అన్నీ బీజేపీకే!

23 Feb, 2017 17:33 IST|Sakshi
ముంబై, థానె మినహా.. అన్నీ బీజేపీకే!
మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో బీజేపీ హవా చూపించింది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ ముంబైతో పాటు థానెను కూడా పోగొట్టుకున్న కమలం పార్టీ, మిగిలిన ఎనిమిది చోట్లా స్పష్టమైన ఆధిక్యం పొందింది. పుణె, ఉల్లాస్‌నగర్, పింప్రి-ఛించ్వాడ్, నాగ్‌పూర్, నాసిక్, షోలాపూర్, అకోలా, అమరావతి కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. పుణెలో బీజేపీ 74 డివిజన్లలో గెలవగా, శివసేన కేవలం 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌కు 2, ఎన్సీపీకి 34 స్థానాలు వచ్చాయి. ఉల్లాస్‌నగర్‌లో బీజేపీకి 34, శివసేనకు 25 స్థానాలు దక్కాయి. పింప్రి-ఛించ్వాడ్‌లో బీజేపీకి 30, శివసేన 5 స్థానాల్లో గెలిచాయి. 
 
ప్రతిష్ఠాత్మకమైన ముంబై కార్పొరేషన్‌లో ఇద్దరూ హోరాహోరీగా నిలిచారు. శివసేనకు 84, బీజేపీకి 81 డివిజన్లు దక్కాయి. కాంగ్రెస్ 31 చోట్ల గెలిచింది. థానెలో శివసేనకు 42, బీజేపీకి 14, ఎన్సీపీకి 16, కాంగ్రెస్‌కు 1 చొప్పున డివిజన్లలో విజయం లభించింది. 
 
నాగ్‌పూర్‌లో బీజేపీకి 70 స్థానాలు దక్కితే కాంగ్రెస్ పార్టీ 30 చోట్ల గెలిచింది. నాసిక్‌లో బీజేపీ 33, శివసేన 20 చోట్ల విజయం సాధించాయి. షోలాపూర్‌లో బీజేపీకి 39, శివసేనకు 14, కాంగ్రెస్‌కు 11 స్థానాలొచ్చాయి. అకోలాలో బీజేపీకి 31, కాంగ్రెస్‌కు 12 వచ్చాయి. అమరావతిలో బీజేపీ 24 స్థానాలు గెలవగా, కాంగ్రెస్ 8 చోట్ల గెలిచింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా పరిషత్తులలో మాత్రం కాంగ్రెస్-శివసేన ఆధిక్యం కనిపించింది. మొత్తం 343 జడ్పీ స్థానాలను గెలుచుకోగా, శివసేనకు 237 వచ్చాయి. కాంగ్రెస్ 253 చోట్ల, ఎన్సీపీ 314 చోట్ల గెలిచాయి. దాంతో ఎక్కువ జిల్లా పరిషత్తులను కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు