రోమియోల ఆటకట్టుకు దండులొస్తాయట!

30 Jan, 2017 15:40 IST|Sakshi
రోమియోల ఆటకట్టుకు దండులొస్తాయట!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ పార్టీకి, రాహుల్‌ గాంధీ పార్టీకి పొత్తు కుదరడంతో భారతీయ జనతా పార్టీకి ఏ దిక్కు లేకుండా పోయినట్లుంది. మళ్లీ హిందుత్వ దిక్కును ఎంచుకొంది. గోమాంసంపై ఆంక్షలు విధిస్తామని, హిందూ దేవాలయాలకు విమాన సర్వీసులను కల్పిస్తామని, రాష్ట్రంలో రామాలయం నిర్మిస్తామని ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇచ్చింది. లవ్‌ జిహాద్‌ను ఎదుర్కొనేందుకు రోమియోలను ఆటకట్టించే దండులను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో విడదల అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింలు ఎక్కువగా ఉన్న కైరానా, మొర్దాబాద్‌లలో శాశ్వతంగా కర్ఫ్యూను విధిస్తామని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేశ్‌ రాణా ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమిపై విజయం సాధించాలంటే హిందుత్వం ఒక్కటే ఎజెండాగా బీజేపీ భావిస్తోంది. అభివృద్ధి నినాదాన్ని అఖిలేష్‌ గట్టిగా వినిపిస్తుండడంతో ఆ నినాదాన్నే పుచ్చుకునే అవకాశం పార్టీకి లేకుండా పోయింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందుల్లో పాకిస్థాన్‌పై సైనిక సర్జికల్‌ దాడులు తుడిచి పెట్టుకుపోయాయి. ఇక మిగిలింది హిందుత్వ ఎజెండానే అనుకున్నట్లుంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి నినాదాన్ని వినిపించిన బీజేపీ నేతలు, ముఖ్యంగా అమిత్‌షా, గోరఖ్‌పూర్‌ ఎంపీ అధిత్యనాథ్‌లు ఉత్తరప్రదేశ్‌ వరకు వచ్చేసరికి హిందుత్వ ఎజెండాను అందుకున్నారు. విద్వేష రాజకీయాల గురించి మాట్లాడారు.

బీజేపీ అనుబంధ సంస్థగా పనిచేస్తున్న హిందూ యువ వాహిణి గత 15 ఏళ్లుగా ఎన్నికల సందర్భంగా హిందుత్వ ఎజెండాతోనే పనిచేస్తోంది. 2013లో ముజఫర్‌నగర్‌ అల్లర్లు రేపిన గాయాన్ని ప్రజలు మరచిపోతున్న తరుణంలో బీజేపీ మళ్లీ హిందుత్వ ఎజెండాను అందుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేవడమే అవుతుంది.
                                                                        - ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌
 

మరిన్ని వార్తలు