ఫేక్‌ పోస్ట్‌ ఫలితం: బీజేపీ నేత అరెస్టు!

12 Jul, 2017 13:29 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఆజ్యం పోసేందుకు ఫేస్‌బుక్‌లో ఫేక్‌ వార్తలను పోస్ట్‌చేసిన వారి అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ట్విట్టర్‌లో తప్పుడు వార్తను పోస్ట్‌చేసిన భారతీయ జనతా పార్టీ సమాచార, సాంకేతిక (ఐటీ) విభాగం కార్యదర్శి తరుణ్‌ సేన్‌ గుప్తాను బుధవారం బెంగాల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లాలో ఓ మహిళపై నడివీధిలో కీచకపర్వం కొనసాగుతోందంటూ భోజ్‌పురి సినిమాలోని ఓ దశ్యాన్ని పోస్ట్‌ చేసిన 38 ఏళ్ల యువకుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే.

ఆ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో తీవ్రంగా షేర్‌ చేసిన హర్యానా బీజేపీ నాయకుడు విజేత మాలిక్‌ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నట్లు తెల్సింది. ఒకప్పుడు శాంతి, సౌభ్రాతత్వాలు విరాజిల్లిన బెంగాల్‌ నేడు అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ 2002 గుజరాత్‌ అల్లర్ల ఫొటోను షేర్‌ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై మంగళవారం నాడు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయిన విషయం తెల్సిందే.
 

మొహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద చిత్రంవేసి రాష్ట్రంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమైన యువకుడి తల్లిదండ్రులకు ఎంత దారుణంగా హింసించారో చూడండంటూ తప్పుడు ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసిన యువకుడిని కూడా మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అల్లర్లకు కారణమైన యువకుడికి అసలు తల్లేలేదని తెల్సింది.

మరిన్ని వార్తలు