ఆప్.. దేశానికే ప్రమాదకరం: బీజేపీ

2 Jan, 2014 16:01 IST|Sakshi

ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికే ప్రమాదకరమని బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎన్నికల్లో తగినన్ని స్థానాలు దక్కించుకోవడంతో దేశ ప్రజల్లో ఒక ఆశ పుట్టిందని, కానీ కాంగ్రెస్ పార్టీతో కేజ్రీవాల్ చేతులు కలపడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. విశ్వాస తీర్మానంపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి కారణాలేంటో కేజ్రీవాల్‌ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు చెత్తబుట్టలో పడేసిన పార్టీతో ఆమ్‌ఆద్మీపార్టీ ఎందుకు చేతులు కలిపిందని హర్షవర్దన్‌ ప్రశ్నించారు.

నిజాయితీగల పార్టీకి ఓటేయాలని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారని, అందుకే నిజాయితీ గల బీజేపీకే ప్రజలు ఓటేశారని, అసెంబ్లీలో ఎక్కువ సీట్లు తమకే వచ్చాయని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. కాగా, విశ్వాస పరీక్ష అంటే తమకు ఏమాత్రం భయం లేదని.. భయపడితే తాము గుడికి వెళ్లి ఉండేవాళ్లమని ఉదయమే కేజ్రీవాల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎటూ విప్ జారీ చేయడంతో ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గడం లాంఛనప్రాయమే అయ్యింది.

మరిన్ని వార్తలు