ఢిల్లీ: హంగ్ అసెంబ్లీ.. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ

8 Dec, 2013 21:16 IST|Sakshi

దేశ రాజధాని నగరంలో కాంగ్రెస్ కోట బద్దలైంది. సర్వేలు వెల్లడించినట్టుగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఢిల్లీ రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా బీజేపీ అదిపెద్ద పార్టీగా అవతరించింది. ఆమ్ ఆద్మీ రెండో స్థానంలో నిలవగా, ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ సింగిల్ డిజిట్ తో మూడో స్థానానికి పడిపోయింది.

అతిపెద్ద పార్టీగా ఏర్పడిన బీజేపీ 31 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఆమ్ ఆద్మీ 28 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇతరులు మూడు స్థానాలు గెలిచారు. కనీసం 36 స్థానాల్లో గెలిస్తే తప్ప ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా పిలుస్తారు కాబట్టి, ఆ కోణంలో బీజేపీ హస్తినలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఎవరికీ మద్దతు ఇవ్వమని, తీసుకోబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ అవసరమైన మద్దతు కూడగడుతుందా అన్నది వేచిచూడాలి. కాంగ్రెస్ ఎలాగూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వదు.

ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం సాధించారు.  ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో షీలాపై 25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీలో అవినీతి నిరోధం, ధరల నియంత్రణ నినాదాలతో తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకొచ్చింది. పదిహేనేళ్ల పాటు వరుసగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటోంది.

 

మరిన్ని వార్తలు