బతికున్న నటుడికి బీజేపీ మౌనం పాటించింది!

10 Apr, 2017 08:50 IST|Sakshi
బతికున్న నటుడికి బీజేపీ మౌనం పాటించింది!
  • మేఘాలయా బీజేపీ నేతల వింత చర్య

  • బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వినోద్‌ ఖన్నా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 31న ముంబై గిర్గామ్‌లోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చేరిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన మెడికల్‌ బులిటెన్‌లో స్పష్టం చేశారు కూడా.

    మరోవైపు వినోద్‌ ఖన్నాకు క్యాన్సర్‌ సోకిందంటూ ఆయన దీనంగా, బలహీనంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆయన చనిపోయారంటూ వదంతులు కూడా గుప్పుమన్నాయి. ఈ వదంతులను గుడ్డిగా నమ్మిన మేఘాలయా బీజేపీ నేతలు ఏకంగా వినోద్‌ ఖన్నా బతికుండగానే ఆయనకు సంతాపం ప్రకటించి..రెండు నిమిషాలు మౌనం పాటించారు. నటుడు వినోద్‌ ఖన్నా ప్రస్తుతం పంజాబ్‌ గురుదాస్‌పూర్‌ నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తమ పొరపాటును వెంటనే గుర్తించిన అక్కడి బీజేపీ నేతలు వివరణ ఇచ్చారు. వినోద్‌ ఖన్నా చనిపోయారంటూ వచ్చిన తప్పుడు వార్తల వల్లే తాము నివాళులర్పించామని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ చర్యకు క్షమాపణలు కోరారు. ఆ నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు.

    మరోవైపు వినోద్‌ ఖన్నా ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో రూమర్స్‌ నేపథ్యంలో ఆయన కొడుకు స్పందిస్తూ తన తండ్రి ప్రస్తుతం చక్కగా కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని అభిమానులకు సూచించారు.

మరిన్ని వార్తలు