రాష్ట్ర నాయకత్వంతో చర్చించాకే..

9 Jan, 2014 01:23 IST|Sakshi
రాష్ట్ర నాయకత్వంతో చర్చించాకే..

సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించకుండా పొత్తులపై తుది నిర్ణయం తీసుకోబోమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టంచేశారు. పొత్తులపై ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరగలేదని, రాష్ట్ర పార్టీని విశ్వాసంలోకి తీసుకోకుండా ఏమీ జరగబోదని హామీ ఇచ్చారు. రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన రాజ్‌నాథ్ ఇక్కడ ఓ హోటల్‌లో పార్టీ రాష్ట్ర పదాధికారులతో భేటీ అయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికలకు సంసిద్ధత, పొత్తులు, తెలంగాణ బిల్లు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చలు జరిగాయి.

 
  టీడీపీతో పొత్తును పార్టీ శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి, సోము వీర్రాజు, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు వ్యతిరేకించగా.. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు సీట్ల సర్దుబాటు సజావుగా ఉంటే పొత్తు మంచిదేనని పేర్కొన్నట్లు తెలిసింది. రాజ్‌నాథ్ స్పందిస్తూ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించకుండా తుది నిర్ణయం తీసుకోబోమని హామీ ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.  భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, వెంకయ్యనాయుడు, యెండల లక్ష్మీనారాయణ తదితరులు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
 
 ఈ సందర్భంగా రాష్ట్ర విభజన బిల్లుకు 11 సవరణలు సూచిస్తూ పార్టీ సీమాంధ్ర నేతలు రాజ్‌నాథ్‌కు ఐదు పేజీల లేఖను అందించారు. పదాధికారుల సమావేశంలో ఎన్నికలకు సంసిద్ధతపై చర్చించినట్లు భేటీ అనంతరం కిషన్‌రెడ్డి మీడియాకు తెలిపారు. పార్టీ పటిష్టత, కొత్తగా చేరిన వారి వివరాలతో రాజ్‌నాథ్‌సింగ్‌కు నివేదిక ఇచ్చామన్నారు. పొత్తులపై ఎటువంటి నిర్ణయం జరగలేదన్నారు. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల ఎంపిక ప్రారంభమవుతుందని, ఈ నెల చివరి వారంలో పార్టీ ఎన్నికల కమిటీ ఢిల్లీ వెళుతుందని వివరించారు. హోంగార్డుల దినసరి వేతనాన్ని వంద రూపాయలు పెంచడాన్ని  స్వాగతించారు.
 
 బీజేపీలో కృష్ణంరాజు చేరిక...
 ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తిరిగి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు పటాన్‌చెరువుకు చెందిన అంజిరెడ్డి, సికింద్రాబాద్‌కు చెందిన ఆలుగడ్డ శ్రీనివాస్ కూడా పార్టీలో చేరారు.
 
 టీడీపీతో పొత్తు వద్దు..
 బీజేపీ ఇరుప్రాంత నేతల ఉమ్మడి ప్రకటన
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు తమకు అవసరం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు మరోసారి స్పష్టం చేశారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి టి.ఆచారి ఒకే వేదికపైకి వచ్చి ఈ మేరకు ప్రకటన చేశారు.

 
  పలువురు పార్టీ నేతలతో కలిసి వారిద్దరూ బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ తమపార్టీ పొత్తు పెట్టుకోదని  కిషన్‌రెడ్డి చెప్పగానే ఆయనపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన విమర్శలను ఖండిం చారు. మీకు అనుకూలంగా మాట్లాడితే  మంచి వారు అవుతారు.. వ్యతిరేకంగా మాట్లాడితే అవినీతిపరుడైపోతాడా? అని ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు