సీఎం పదవిపై ఎవరి ఆశలు వారివి!

5 Aug, 2014 11:44 IST|Sakshi
సీఎం పదవిపై ఎవరి ఆశలు వారివి!

లక్నో:ఉత్తరప్రదేశ్ లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయం ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఆశలను రేపుతోంది. యూపీ రాష్ట్ర అసెంబ్లీపై బీజేపీ ప్రభుత్వం కార్యాచరణను ఏమీ సిద్ధం చేయకపోయినా.. పార్టీ పెద్దలు మాత్రం ఎవరు ప్రయత్నాల్లో వారు నిమగ్నమైయ్యారు. యూపీ ఎన్నికలో సమీపంలో లేకపోయినా పార్టీ నాయకులు మాత్రం దీనిపై దృష్టి సారించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి అఖిలేష్ యాదవ్ కంటే తన కొడుకు వరణ్ గాంధీనే ఉత్తమం అని ప్రకటించి కేంద్ర మంత్రి మేనకా గాంధీ ముందుగానే కర్చీఫ్ వేశారు. దీనిపై అఖిలేష్ ప్రభుత్వంతో పాటు, యూపీ రాష్ట్ర బీజేపీ పెద్దలు కూడా పెదవి విరుస్తున్నారు. మేనక్, వరుణ్ ఇద్దరూ యూపీ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆమె వ్యాఖ్యలపై రాష్ట్ర నేతలు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. వరుణ్ గాంధీ సీఎం అంశంపై ముందుగా చర్చలకు తెరలేపడం అంత సమంజసం కాదంటున్నారు.
 

దీనిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ స్పందిస్తూ.. 'బీజేపీ ప్రభుత్వం యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ విషయంపై మాట్లాడితే బాగుంటుందని మేనకాగాంధీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే శాంతిభద్రతలు మెరుగుపడతాయనే ఆశాభావాన్ని మాత్రం ఆయన వ్యక్తం చేశారు.' ఎవరు ముఖ్యమంత్రి అనేది పార్టీ అధినాయకత్వానికి సంబంధించినది. దీని గురించి ముందే మాట్లాడటం సమంజసం కాదు. సరైన సమయంలో తగిన నిర్ణయం పార్టీ పెద్దలు తీసుకుంటారు'అని బాజ్ పాయ్ స్పష్టం చేశారు. అంటే దీన్ని బట్టి సీఎం రేసులో వరుణ్ గాంధీనే కాదు.. తనతోపాటు చాలామంది ఉన్నారన్న సంకేతాలను ఆయన సూచనప్రాయంగా తెలియజేశారు.

సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మేనకా గాంధీ తన కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ పేరును స్వయంగా ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుణ్ అత్యుత్తమ వ్యక్తి అవుతారని అన్నారు. దాంతో పాటు ఉత్తరప్రదేశ్ లోఅఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అత్యాచారాలు, నేరాలను అరికట్టడంలో విఫలమైన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో పాటు అంతర్లీనంగా ఉన్న తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించారు. ఇంతవరకూ పార్టీ పెద్దల ఆశలు బాగానే ఉన్నా.. అవి నెరవేరాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు