అక్కడే వెతుక్కోవాలట...!

5 Jun, 2016 03:10 IST|Sakshi
అక్కడే వెతుక్కోవాలట...!

రెండు తెలుగురాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి చూసి పాతతరం నాయకులు ఎంతో నిర్వేదానికి గురవుతున్నారట. కేంద్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుంటే రెండు తెలుగురాష్ట్రాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోందని వాపోతున్నారట. గతంలో ఏమాత్రం పట్టులేని అసలు రాజకీయంగా ఎలాంటి ఆశలు లేని చోట్ల కూడా అధికారంలోకి వస్తుండగా ఏపీ,తెలంగాణలో ఆ పరిస్థితి లేదని చేతులెత్తేస్తున్నారట. ఇటీవల అస్సాంలో  అధికారంలోకి వచ్చి అందరినీ ఆశ్చర్య చకితులను చేయడాన్ని ఉదహరిస్తున్నారు. అస్సాంలోనే మరో చోట గెలిచామంటూ ఇక్కడ సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకోవడం తప్ప ఇక్కడ గెలిచేదెప్పుడని పెదవి విరుస్తున్నారట.

ఎవరిదో పెళ్లికి ఇంకెవరిదో హడావుడి అన్నట్లుగా  మొత్తం జాతీయస్థాయిలోనే పార్టీకి రెండు ఎంపీ సీట్లు వచ్చినపుడు అందులో ఒకటి తెలంగాణలో గెలవడం, గతంలో సొంతంగా 8 ఎంపీ సీట్లకు పోటీచేసి 7 సీట్లు గెలిచి కూడా అధికారసాధన దిశలో అడుగు ముందుకు వేయకపోవడానికి కారణాలు ఏమిటని తెగ ఇదై పోతున్నారట. గతం నుంచి జాతీయనాయకత్వమే దీనికి కారణమని మరికొందరు నాయకులు వాదిస్తున్నారు. పార్టీ సొంతంగా పుంజుకుంటున్న దశలో ఎప్పటికప్పుడు టీడీపీతో పొత్తు కుదుర్చడంతో మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా తయారుకావడం షరామామూలుగా జరిగి పోతోందంటున్నారు. మిగతా కారణాలు, సాకులను పక్కనపెట్టి ఏమైతే అది అయ్యిందని పొగొట్టుకున్న చోటే వెతుక్కోవడం మంచిదని, దాని ద్వారా మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదని ముక్తాయింపునిస్తున్నారట...

మరిన్ని వార్తలు