ఆ గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది

24 May, 2017 15:04 IST|Sakshi
‘ఆ గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది’

► మహానుభావులు రజాకార్లతో అలుపెరగని పోరాటం చేశారు.
► గ్రామస్థులు చేసిన పోరాటాలు మరుగున పడిపోయాయి.
► ఇది ఒక చరిత్ర, కొత్త అధ్యాయానికి నాంది అని షా అన్నారు.


చిట్యాల: గుం‍డ్రాంపల్లి గొప్ప చరిత్ర గల గ్రామమని.. ఈ ఊర్లో ఎందరో మహానుభావులు రజాకార్లతో అలుపెరగని పోరాటం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. నల్లగొండ జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా బుధవారం చిట్యాల మండలం గుండ్రంపల్లి చేరుకున్న అమిత్‌షా గ్రామంలోని దళితవాడలను సందర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. జాతీయ పథకాల పనితీరు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బూత్‌ స్థాయి కార్యకర్తల సభలో మాట్లాడుతూ.. నిజాం పాలనలో రజాకార్లు ఆడవారిపై అత్యాచారాలు చేశారు.

 రాక్షసంగా ప్రవర్తించారు. అలాంటి వారిని తరిమికొట్టిన ఘనమైన చరిత్ర ఈ ఊరికి ఉంది. ఆ రోజు గ్రామస్థులు చేసిన పోరాటాలు మరుగున పడిపోయాయి. వాటిని వెలుగలోకి తేవాల్సిన సమయం వచ్చింది. రజాకార​‍్ల విముక్తి కోసం పోరాడిన వాళ్లు పునరాలోచించుకోవాలి.. వారి ఆశయాలకు అనుగుణంగా పాలన నడుస్తోందా.. లేదా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అమరుల ఆశయాలకు అనుగుణంగా పాలన తేవడం కోసం బీజేపీ అధికారంలోకి రావాలి. పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుడు, గ్రామ, మండల, రాష్ట్ర, దేశ అధ్యక్షుడిని ఒకే వేదికపై చేర్చాము ఇది ఒక చరిత్ర, కొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు.

అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. అమిత్‌షా పర్యటనతో కాంగ్రెస్‌ వాళ్లు ఉలిక్కి పడుతున్నారు. పీసీసీ చైర్మెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులు చవక బారు విమర్శలు ఆపి ముందు రజాకార్ల బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలి. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాల చరిష్మా చూసి కాంగ్రెస్‌ వారికి నిద్ర రావడం లేదు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్‌ వాళ్లు ఓర్వలేక పోతున్నారన్నారు.

కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఆనాడు రజాకార్ల ఆగడాలకు సాక్షి భూతంగా నిలిచిన గుండ్రాంపల్లి నుంచే బీజేపీ జైత్రయాత్ర ప్రారంభం కావాలి. నిజాంకి వ్యతిరేకంగా ఎలా పోరాడారో.. ఇప్పుడు అలాగే పోరాడాల్సిన అవసరం ఉంది. చరిత్రను వక్రీకరిస్తూ కొందరు రజాకార్లపై పోరాటాన్ని మత పరమైన పోరాటంగా మార్చారు. అలాంటి వారికి బీజేపీ కార్యకర్తలు బుద్ధి చెప్పాలన్నారు.

మరిన్ని వార్తలు