ల్యాప్‌ టాప్‌లు ఫ్రీ.. రుణాలను మాఫీ చేస్తాం

28 Jan, 2017 16:13 IST|Sakshi
ల్యాప్‌ టాప్‌లు ఫ్రీ.. రుణాలను మాఫీ చేస్తాం

లక్నో: త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. యూపీలో అధికారంలోకి వస్తే యువకులకు 1 జీబీ ఇంటర్నెట్‌ సదుపాయంతో ఉచితంగా ల్యాప్‌ టాప్‌లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం లక్నోలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనికి 'లోక్ కల్యాణ్‌ సంకల్ప పత్ర'గా నామకరణం చేశారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా జనాకర్షక పథకాలను ప్రకటించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడి రామమందిరాన్ని నిర్మాస్తామని హామీ ఇచ్చారు. అన్ని యూనివర్శిటీల్లో ఉచిత వై ఫై సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీ బీజేపీ చీఫ్‌ కేశవ్ ప్రసాద్‌ మౌర్య, యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.

కేంద్రం ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌కు లక్ష కోట్ల రూపాయలను మంజూరు చేసినా అభివృద్ది జరగలేదని అమిత్‌ షా విమర్శించారు. వచ్చే ఐదేళ్లకు రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి 150 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అవినీతి రహిత సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళల విద్యకు, ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇస్తామని, ఉద్యోగాల్లో 90 శాతం స్థానికులకే ఇస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్‌ మాఫియా భరతం పట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాగునీటి కోసం 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. ఇంటర్‌ వరకు ఉచిత విద్యను అందిస్తామని,  పేదలకు గరీబ్‌ కల్యాణ్‌ కార్డులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి వసతులతో 10 కొత్త యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు