'25 ఏళ్లేంటి.. ఆయనలా అనలేదు'

14 Jul, 2015 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత దేశంలోమంచి రోజులు వచ్చేందుకు మరో పాతిక సంవత్సరాలు పడతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారంటూ విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో వాటిని బీజేపీ ఖండించింది. అసలు ఆయన అలాంటి మాటలు అనలేదని, పూర్తిగా సంప్రదాయబద్ధమైన జీవితాన్ని, ప్రాచీన విలువలను కాపాడుకుంటూ ఉన్న దేశంలో మార్పు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని మాత్రమే అన్నారని వివరణ ఇచ్చింది. 25 సంవత్సరాలు పడతాయని అమిత్ షా చెప్పినట్లు అంటున్న ప్రతిపక్షాల మాటలు పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, ఆధారం లేనివని బీజేపీ స్పష్టం చేసింది.

తమ పార్టీ అవినీతిని తగ్గించేందుకు తీవ్రంగా కృషిచేస్తోందని, మరో ఐదేళ్లలో భారత్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని అమిత్ షా చెప్పారని బీజేపీ మీడియా సెల్ ఇన్ ఛార్జీ శ్రీకాంత్ శర్మ తెలిపారు. ప్రపంచ నేతగా భారత్ ఎదుగుతుందన్న కల మాత్రం 25 ఏళ్లలో నెరవేరుతుందని ఆయన చెప్పారని గుర్తు చేశారు. నరేంద్రమోదీ చెప్పిన మంచిరోజులు మరో 25 ఏళ్లలో వస్తాయని సోమవారం భోపాల్ పర్యటనకు వెళ్లిన అమిత్ షా చెప్పినట్లు మీడియాలో ప్రసారం జరిగింది. దీనిపై పలు విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడంతో పార్టీ తరుపున మంగళవారం ఈ వివరణ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు