బీజేపీ ఎత్తుకు సీఎం చిత్తు!

13 Mar, 2017 14:30 IST|Sakshi
బీజేపీ ఎత్తుకు సీఎం చిత్తు!

ఇంపాల్‌: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అతి పెద్దగా అవతరించిన తామే అధికారంలో కొనసాగుతామని దీమాగా ఉన్న ఇబోబి సింగ్ కు బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఆదివారం రాత్రి 32 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా ముందు పరేడ్ నిర్వహించడం ఇబోబి సింగ్ ఖంగుతిన్నారు. బీజేపీకి మద్దతు ప్రకటించిన వారిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆండ్రో శ్యామ్ కుమార్ కూడా ఉండడంతో సింగ్ షాకయ్యారు.

వెంటనే తేరుకుని అర్ధరాత్రి రాజ్ భవన్ కు పరుగులు తీశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తననే ముందుగా ఆహ్వానించాలని గవర్నర్ ను కోరినట్టు తర్వాత విలేకరుల సమావేశంలో చెప్పారు. గవర్నర్ తమకే అవకాశం ఇస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా ఉన్న 27 మంది ఎమ్మెల్యేలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమ ఎమ్మెల్యేల్లో ఎటువంటి అసంతృప్తి లేదని, తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. నాలుగోసారి సీఎం పదవిని చేపట్టాలని భావిస్తున్న ఇబోబి సింగ్ కు బీజేపీ అడ్డుకట్టే వేసేలా కనబడుతోంది.

మొదట ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని, తర్వాతే కొత్త ప్రభుత్వ ఏర్పాటు గురించి మాట్లాడాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి (బీజేపీ మణిపూర్‌ వ్యవహారాల బాధ్యుడు) రామ్‌ మాధవ్‌ డిమాండ్ చేశారు. మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు 31. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ కు 28, బీజేపీ 21, ఇతరులు 10, టీఎంసీ ఒక స్థానాన్ని గెల్చుకున్నాయి. ఇతరులతో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు