'ఆ తప్పే అమెరికాను కుదేలు చేసింది'

22 Jan, 2017 22:06 IST|Sakshi
'ఆ తప్పే అమెరికాను కుదేలు చేసింది'
బీజింగ్‌: అమెరికా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణం ఆ దేశమేనని అలీబాబా డాట్‌ కామ్‌ అధినేత జాక్‌ మా ఆరోపించారు. యుద్ధాల కోసం ఆ దేశం చేసిన ఖర్చుల కారణంగానే ఆర్థిక పరిస్థితి దెబ్బతిందే గానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్లకాదన్నారు. అమెరికా గత 30 ఏళ్లలో రూ.952లక్షల కోట్లను మౌలిక సదుపాయాలపై కాకుండా యుద్ధాలపై వెచ్చించిందని తెలిపారు.
 
చైనా అమెరికన్ల ఉద్యోగాలను దొంగిలించలేదని అన్నారు. అమెరికా స్వయంకృత అపరాధాల కారణంగా అక్కడ ఉద్యోగాల కొరత ఏర్పడిందని చెప్పారు. ముప్పై ఏళ్ల క్రితం మేథోసంపత్తిపై హక్కులను మాత్రం ఉంచుకొని కార్మిక ఉద్యోగాలను మిగిలిన ప్రపంచానికి వదిలేసిందని జాక్‌మా అన్నారు. ఆ కారణంగానే ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు భారీగా ఆదాయాన్ని సాధించాయని పేర్కొన్నారు.
 
వ్యాపార యుద్ధాన్ని ప్రారంభించడం తేలికే కానీ ముగించడం కష్టం అని ఆయన అన్నారు. ఈ యుద్ధం ముగియాలంటే అసలు యుద్ధం ప్రారంభం కావాలని అన్నారు. సాధారణంగా వ్యాపారం వల్ల ప్రజల ఆలోచనలు , సంస్కృతులను పంచుకుంటారని అన్నారు. 1979లో చైనా అమెరికా వ్యాపార విలువ 2.5 బిలియన్‌ డాలర్లు అని అది 2016 నాటికి 211 రెట్లు పెరిగి 519 బిలియన్‌ డాలర్లు అయిందని వెల్లడించారు.
మరిన్ని వార్తలు