రైల్వేస్టేషన్ వద్ద పేలుళ్లు.. 86 మంది మృతి

10 Oct, 2015 19:41 IST|Sakshi
రైల్వేస్టేషన్ వద్ద పేలుళ్లు.. 86 మంది మృతి

టర్కీ రాజధాని అంకారాలో రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన జంట పేలుళ్లలో 86 మంది మరణించారు. మరో 180 మంది  గాయపడ్డారు. ఈ విషయాన్ని దోగన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వామపక్ష సంఘాలు, కుర్దిష్ అనుకూల విపక్ష పార్టీలు తలపెట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగాయి. మృతుల్లో ఎక్కువమంది శాంతియాత్రలో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలే ఉన్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న వారి మృతదేహాలు, వారి పక్కన శాంతిని ఆకాంక్షిస్తూ నినాదాలు రాసివున్నఫ్లకార్డులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా ఉంది.

ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టర్కీ ప్రభుత్వం.. పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసింది. పేలుళ్ల ప్రదేశాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని తనిఖీలు జరుపుతున్నారు. పెద్దసంఖ్యలో గాయపడిన వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు