సరుకు రవాణా ఆదాయంపై డీజిల్ దెబ్బ

26 Feb, 2016 05:31 IST|Sakshi
సరుకు రవాణా ఆదాయంపై డీజిల్ దెబ్బ

రవాణా చార్జీల పెంపు లేదు..  రైళ్లను వదిలి లారీలను ఆశ్రయిస్తున్న వ్యాపారులు
 
బెంగళూరు:  డీజిల్ ధరలు తగ్గడం రైల్వే శాఖకు ప్రతికూలంగా మారింది. సరుకు రవాణా కోసం ఇన్నాళ్లూ రైళ్లపై ఆధారపడిన వ్యాపారులు ఇప్పుడు లారీలు, ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రైళ్ల కంటే లారీల్లోనే వ్యయం తక్కువ కావడం ఇందుకు కారణం. డీజిల్ ధరలు క్రమంగా దిగివస్తుండడంతో రవాణా వ్యయం కూడా తగ్గుముఖం పడుతోంది. అందుకే సరుకు రవాణా ఆదాయంపై రైల్వేశాఖ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన 2016-17 రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రైల్వేశాఖ సరుకు రవాణా చార్జీల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు.

గతేడాది 1,098 మిలియన్ టన్నుల సరకును రవాణా చేయగా.. ఈ ఏడాది కూడా అంతేమొత్తాన్ని రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుం ది. సరుకు రవాణాలో ప్రతిఏటా 10 వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి ఆ ఆనవాయితీ తప్పినట్లు కనిపిస్తోంది. రైల్వేశాఖకు సరుకు రవాణా ద్వారానే  అత్యధిక ఆదాయం లభిస్తోంది. 2014-15లో మొత్తం ఆదాయంలో సరుకు రవాణా ద్వారా వచ్చిన ఆదాయం 67.4 శాతం కావడం గమనార్హం. సిమెంట్, ఇనుము, ఉక్కు వంటి వాటి రవాణా తగ్గడం వల్ల తమ సరుకు రవాణా ఆదాయం క్షీణిస్తోందని రైల్వే వర్గాలు తెలిపాయి.

 

మరిన్ని వార్తలు