భారీ సంఖ్యలో బీఎండబ్ల్యూ కార్ల రీకాల్

26 Dec, 2016 10:42 IST|Sakshi
భారీ సంఖ్యలో బీఎండబ్ల్యూ కార్ల రీకాల్
బీజింగ్ : ఎయిర్బ్యాగ్స్ లోపాలతో ప్రముఖ కార్ల సంస్థలు చేస్తున్న రీకాల్ బాటలో జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా చేరిపోయింది. లక్షల సంఖ్యలో కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఎయిర్బ్యాగ్స్లో ఏర్పడ్డ లోపాల కారణంగా 1,93,611 బీఎండబ్ల్యూ కార్లను చైనాలో రీకాల్ చేయనున్నామని క్వాలిటీ వాచ్ డాగ్ తెలిపింది. 2005 డిసెంబర్ 9 నుంచి 2011 డిసెంబర్23 వరకు దాదాపు 1,68,861 కార్లను బీఎండబ్ల్యూ చైనాకు దిగుమతి చేసింది. అంతేకాక 2005 జూలై 12 నుంచి 2011 డిసెంబర్ 31 వరకు 24,750 సెడాన్లను చైనాకు పంపింది.
 
ఈ కార్లన్నింటిన్నీ 2017 ఆగస్టు 1 నుంచి రీకాల్ చేయడం ప్రారంభిస్తుందని నాణ్యత పర్యవేక్షణ, తనిఖీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. డ్రైవర్కు, ముందు కూర్చునే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్బ్యాగ్స్లో లోపాలున్నాయని, లోపల గ్యాస్ జనరేటర్లకు హాని కలిగే అవకాశముందని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సురక్షణ నేపథ్యంలో వీటిని రీకాల్ చేస్తున్నామని తెలిపింది. ఈ లోపాలున్న భాగాలను ఎలాంటి చార్జీలు లేకుండానే ఉచితంగా వేరే వాటిని అమర్చి ఇస్తామని బీఎండబ్ల్యూ తెలిపినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. 
మరిన్ని వార్తలు