బ్రేకింగ్‌: భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు!

31 May, 2017 10:02 IST|Sakshi
భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు!
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బాంబు పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడులో భారతీయ ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదు. కానీ ఈ పేలుడులో పెద్ద ఎత్తున 65 మంది ప్రాణాలు విడిచినట్టు అఫ్ఘాన్‌ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 325మంది గాయపడ్డారని తెలిపింది. భారత రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలోనే సంభవించిన ఈ పేలుడు ఈ ప్రాంతమంతా నెత్తుటి చారికలతో, క్షతగాత్రుల హాహాకారాలతో భీతావహంగా మారింది.

ఈ పేలుడు ఘటనతో వెంటనే అలర్ట్‌ అయిన భద్రతా సిబ్బంది వెంటనే ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పేలుడు ధాటికి భారత రాయబార కార్యాలయం కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. జర్మన్‌ గేటు వద్ద పేలుడు జరిగినట్టు ప్రాథమిక సమాచారం. వివిధ దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్న ఈ ప్రదేశానికి జర్మన్‌ గేటు ముఖద్వారంగా ఉంటుంది. దీనికి సమీపంలోనే జర్మనీ రాయబార కార్యాలయం నెలకొని ఉంది. అయితే, దేవుని దయవల్ల ఈ పేలుడులో భారత ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదని, వారు సురక్షితంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌లో తెలిపారు.
>
మరిన్ని వార్తలు