-

బెంగాల్, మణిపూర్‌లో బాంబు పేలుళ్లు

18 Aug, 2013 23:46 IST|Sakshi

ఇంఫాల్/జల్‌పాయ్‌గురి: పశ్చిమబెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో సంభవించిన బాంబు పేలుళ్లు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఆయా పేలుళ్లలో పలువురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వివరాలు.. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఓ హోటల్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 9 గంటల సమయంలో శక్తివంతమైన బాంబును విసిరారు.

ఈ పేలుడు ధాటికి  హోటల్‌లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హోటల్ యజమాని నుంచి డబ్బులు వసూలు చేసేందుకే తీవ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

అదేవిధంగా, పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఉన్న బరోదిశా పట్టణంలో ఆదివారం ఓ బస్సులో బాంబు పేలింది. అప్పటికే ఓ హోటల్ ముందు ఆగి ఉండడంతో బస్సులో ప్రయాణికులు అందరూ కిందకి దిగిపోయారని, అయితే, అందులోనే ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు తామే బాధ్యులమని నేషనల్ లిబరేషన్ ఫోర్స్ ఆఫ్ బెంగాలీస్(ఎన్‌ఎల్‌ఎఫ్‌బీ) ప్రకటించుకున్నట్టు చెప్పారు. బెంగాలీలపై అస్సాంలో జరగుతున్న వేధింపులకు నిరసనగానే బాంబును అమర్చినట్టు ఎన్‌ఎల్‌ఎఫ్‌బీ ప్రకటించింది.

మరిన్ని వార్తలు