రెండు తెలుగు రాష్ట్రాల్లో డెకాయిట్ల పాలన

5 May, 2017 21:59 IST|Sakshi
రెండు తెలుగు రాష్ట్రాల్లో డెకాయిట్ల పాలన

విజయవాడ :
రెండు తెలుగు రాష్ట్రాలోనూ ప్రజలను దోచుకుతినే డెకాయిట్ల పాలన కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. రైతుల నుంచి ఎండుమిర్చిని క్వింటా రూ.2500 చొప్పున కొంటున్న కార్పొరేట్‌ సంస్థలు తమ స్టోర్స్‌లో క్వింటాను రూ.34 వేలకు విక్రయిస్తున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. దీన్ని డెకాయిట్ల పాలన కాకపోతే ఏమంటారని ప్రశ్నించారు.

విజయవాడ నిమ్మతోట సెంటర్‌లో ఉన్న ఒక ప్రముఖ స్టోర్‌ (రిలయన్స్‌)ను శుక్రవారం సాయంత్రం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నారాయణ పరిశీలించారు. స్టోర్‌లో విక్రయిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలను స్టోర్‌ యజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. నిత్యావసరవస్తువుల ధరల నియంత్రణలో రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.

కొంత మంది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరికొంత మంది రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలను తగులబెడుతున్నారని, ఈ నేపథ్యంలో వారి బాధ, కడుపు మంట గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని హితవుపలికారు. మిర్చి, పసుపు, కందులు, టమాటా సాగుచేసిన రైతుల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయన్నారు. క్వింటా మిర్చిని రూ.5వేలకు కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి హరీష్‌రావు గొప్పలు చెప్పుకుంటున్నారని, కార్పొరేట్‌ సంస్థల్లో క్వింటా మిర్చిని రూ.34 వేలకు విక్రయిస్తున్నారని, దీనిని చూసి సిగ్గు పడాలని హితవుచెప్పారు.

క్వింటా మిర్చిని రూ.5 వేలకు కేంద్రం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీసాలు మెలేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నా, క్వింటా మిర్చి ఉత్పత్తికి ఎంత వ్యయం అవుతుందో రైతు బిడ్డ అయిన ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు రైతుల గురించి మాట్లాడే హక్కులేదన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు ఐక్యంగా ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు