కృష్ణా జలాల పంపిణీపై నేడు తుది తీర్పు

29 Nov, 2013 01:28 IST|Sakshi
కృష్ణా జలాల పంపిణీపై నేడు తుది తీర్పు

‘బ్రజేశ్‌కుమార్’ మధ్యంతర తీర్పులో మన రాష్ట్రానికి వ్యతిరేకంగా అనేకాంశాలు..
మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్రం
అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోకుండా తీర్పునిస్తే కృష్ణా రైతులకు తీవ్ర నష్టం
‘రాష్ట్ర విభజన’ నేపథ్యంలో తీర్పునకు ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్:
గత పదేళ్లుగా సంబంధిత రాష్ట్రాల వాదనలను వింటున్న బ్రజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ శుక్రవారం తుది తీర్పును ప్రకటించనున్నది. అరుుతే ఏ విధమైన తీర్పు వెలువడనుందనే అంశమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువడితే మాత్రం రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో మన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనేక అంశాలు ఉన్నాయి. వీటి పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. తుది తీర్పు సందర్భంగా వీటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఆయూ అంశాలను సవరించని పక్షంలో.. రాష్ర్టంలో కృష్ణా జలాలపై ఆధారపడిన రైతాంగం తీవ్రంగా నష్టపోక తప్పదు. ప్రస్తుతం రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పునకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ట్రిబ్యునల్ ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై తీర్పును వెల్లడించనుంది. ఈ దృష్ట్యా రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ రవూఫ్ తదితర అధికారులు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు.
 
 ఇదీ నేపథ్యం...
 కృష్ణానది నీటి వాడకంపై మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో నీటి పంపకాలపై 1969లో ఆర్‌ఎస్ బచావత్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ట్రిబ్యునల్ 1973లో తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పును పునఃపరిశీలించాలని 2002లో మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి. ఈ క్రమంలో 2004 ఏప్రిల్ 2వ తేదీన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. జస్టిస్ ఎస్‌పీ శ్రీవాస్తవ, జస్టిస్ డీకే సేథ్‌లు సభ్యులుగా ఉన్నారు. అప్పటినుంచి పలుమార్లు సమావేశమైన ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాల వాదనలను విన్నది. 2010 డిసెంబర్ 30న మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో పలు అంశాలు మన రాష్ర్ట ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రం సవరణలకు డిమాండ్ చేసింది. గత మూడేళ్లుగా సవరణలపై వాదనలను కొనసాగాయి. ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చాయి. ఈ నేపథ్యంలో తుది తీర్పు ప్రకటనకు ట్రిబ్యునల్ సిద్ధమైంది.
 
 ఆలమట్టిని నియంత్రిస్తారా?
 మధ్యంతర తీర్పులో మనం తీవ్రంగా వ్యతిరేకించిన అంశం ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణానదిపై మన ప్రాంతానికి ఎగువున నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల మనకు సకాలంలో నీరు రావడం ఆగిపోతుంది. ఇప్పటికే 519.6 మీటర్లు ఉన్న ఈ డ్యాం ఎత్తును 524.24 మీటర్లకు పెంచుకునేందుకు ట్రిబ్యునల్ అంగీకరించింది. దీనివల్ల కర్ణాటక ప్రభుత్వం అదనంగా మరో 103 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. దిగువకు వచ్చే నీటి ప్రవాహం గణనీయంగా పడిపోతుంది. అలా జరిగితే కృష్ణానదిపై మన రాష్ట్రంలో ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
 
 మిగులు జలాలతోనే మన భవిష్యత్తు!
 రాష్ర్టంలో కృష్ణానదిపై ఆధారపడిన ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో మిగులు జలాలను ఆధారంగా చేసుకుని కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, వెలుగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టాం. వీటి కోసం సుమారు 227 టీఎంసీల నీరు అవసరం ఉంది.  మొదటి ట్రిబ్యునల్ (బచావత్) ప్రకారం ఈ నీటిని వాడుకునే స్వేచ్ఛ మనకు మాత్రమే ఉంది. కానీ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో మిగులు జలాలను ఎగువ ప్రాంతాలకు కూడా పంపిణీ చేసింది. ఇదే తీర్పు అమల్లోకి వస్తే మనకు మిగులు జలాలు అందుబాటులో ఉండవు. దాంతో పైన పేర్కొన్న ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎగువ రాష్ట్రాలకు మిగులు జలాల పంపిణీని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదించింది.
 
 65% డిపెండబులిటీపై తీవ్ర అభ్యంతరం..
 మరోవైపు ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పెంచడానికి వీలుగా ప్రస్తుత ట్రిబ్యునల్ నీటి లభ్యతను అంచనా వేయడంలో కొత్త పద్దతిని అనుసరించింది. సాధారణంగా నదిలో నీటి లభ్యతను అంచనా వేయడానికి 75 శాతం డిపెండబులిటీని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతం డిపెండబులిటీ పద్దతిని అనుసరించింది. ఆ మేరకు నదిలో నీరు ఎక్కువగా ఉందంటూ ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పెంచింది. ఈ విధంగా 65 శాతం డిపెండబులిటీ పద్దతిని అనుసరించడాన్ని కూడా రాష్ర్టం తీవ్రంగా వ్యతిరేకించింది.
 
 సకాలంలో నీటి విడుదలకు ఆదేశిస్తుందా?
 కర్ణాటకలో ఆలమట్టి అందుబాటులోకి వచ్చినందున మన ప్రాజెక్టులకు సకాలంలో నీటి విడుదల అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆలమట్టి నిండే వరకు నీటిని దిగువకు విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రాజెక్టులకు నీరు రాదు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగానే నీటి విడుదల విషయంలో కాలపరిమితులను నిర్దేశించాల్సిందిగా రాష్ట్రం ట్రిబ్యునల్‌ను కోరింది.
 
 నియంత్రణ బోర్డుకు విస్తృత అధికారాలు ఉంటాయా ?
 కృష్ణా జలాల వాడకంపై ప్రత్యేక నియంత్రణ బోర్డును ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో సూచించింది. బోర్డులో ఆయా రాష్ట్రాల అధికారులతో పాటు, కేంద్ర అధికారులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. అయితే ఈ మేరకు ఏర్పడబోయే బోర్డుకు సంక్రమించే అధికారాలపైనే దిగువ రాష్ర్టం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటికే తుంగభద్ర బోర్డు నామమాత్రంగా పని చేస్తున్న అనుభవం మనకు ఉంది. ఎగువ ప్రాంతంవారు ఇష్టానుసారంగా నీటిని ఉపయోగించుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కొత్తగా ఏర్పడబోయే కృష్ణానది నియంత్రణ బోర్డు కూడా విస్త­ృతాధికారాలు లేకుండా తుంగభద్ర బోర్డులాగే ఉంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు