-

వీటి రేటే సపరేటు!

26 Jan, 2016 04:12 IST|Sakshi
వీటి రేటే సపరేటు!

♦ అన్నీ జనరిక్‌లే కానీ బ్రాండ్ల పేరిట భారీ ధరలు
♦ సేల్స్ సిబ్బందికి భారీ ఖర్చు.. వైద్యులకూ బహుమతులు
♦ స్టాకిస్ట్ నుంచి మందుల షాపుల దాకా భారీగా కమీషన్లు
♦ ఈ ఖర్చులకు లాభం కూడా కలిపి బ్రాండెడ్ మందుల ధరల నిర్ణయం
♦ పలు చోట్ల మామూలు దుకాణాల్లోనూ జనరిక్స్‌కూ భారీ ధరలు
♦ కొనేవారిలో అవగాహనతోనే చెక్ పెట్టగలమంటున్న నిపుణులు
 
 సాక్షి, బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి:
 మధుమేహ రోగులు ఎక్కువగా వాడే మెట్‌ఫార్మిన్ ఔషధంతో ఎన్నో మందులు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో కొన్ని టాబ్లెట్లు రూపాయికన్నా తక్కువ ధరకే దొరుకుతుండగా... కొన్ని ఒక్కొక్కటీ రూ.10కి పైనే ఉన్నాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు అత్యవసరంగా వాడే మెరోపెనెమ్ ఇంజక్షన్‌ను ఓ కంపెనీ రూ.1,500కు విక్రయిస్తుండగా... మరో కంపెనీ రూ.57కే అమ్ముతోంది. ఇవేకాదు కొన్ని వందల రకాల మందుల్లో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇదెలా సాధ్యం, ధరల్లో ఇంత తేడాలున్నా ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది, మందుల నాణ్యతను నిర్ధారించే డ్రగ్ కంట్రోలర్ గానీ, మరో సంస్థగానీ ధరలను ఎందుకు నియంత్రించటం లేదు..? ఈ ప్రశ్నలకు జవాబు.. మందుల కంపెనీలు, ఆసుపత్రులు, నియంత్రణ సంస్థల నుంచి ఒక్కో రకంగా వస్తుంది. ఎవరెలా సమాధానం చెప్పినా... అందులో సామాన్యుడి గోడు కనిపించదనేది పచ్చినిజం. ఇండియాలో తయారవుతున్నవన్నీ జనరిక్ మందులే అయితే ధరల్లో ఎందుకింత తేడాలున్నాయనేది ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహం. ఈ సందేహం తీరాలంటే... జనరిక్స్‌లో రకాల గురించి, కంపెనీల మార్కెటింగ్ వ్యూహాల గురించి తెలుసుకోవాలి.

 జనరిక్ రకాలను చూస్తే..
 1. బ్రాండ్ పేరు కాకుండా జనరిక్ సాల్ట్ (ఔషధం పేరు) మాత్రమే ఉండేవి: ఉదాహరణకు హైపర్‌టెన్షన్ చికిత్సలో వినియోగించడానికి డాక్టర్ రెడ్డీస్, జైడస్ క్యాడిలా సంస్థలు తయారుచేసే ఆమ్లోడిపిన్ బెసలైట్. ఇది రసాయనం పేరు మాత్రమే. ఈ కంపెనీలు వాటికి బ్రాండ్ పేరేమీ పెట్టకుండా జనరిక్ సాల్ట్ పేరుతోనే మార్కెట్లోకి తెచ్చాయి. బ్రాండ్ పేరు లేదు కనక వీటిని మార్కెట్ చేయడానిక్కూడా ప్రత్యేకంగా ఖర్చేమీ పెట్టరు. కాబట్టి తక్కువ ధరకే లభ్యమవుతాయి. నిపుణులు చెప్పేదేమంటే... డాక్టర్ రెడ్డీస్, జైడస్ అనే కంపెనీలే పెద్ద బ్రాండ్‌లు. కాబట్టి వీటినీ బ్రాండెడ్ జనరిక్స్‌గానే భావించాలి. ఏదో ఒక బ్రాండ్ పేరు పెట్టి విక్రయించే జనరిక్స్‌కన్నా ఇవి చౌకగానే లభిస్తాయి.
 2. పాపులర్ కాని బ్రాండ్: కొన్ని కంపెనీలు వివిధ పేర్లతో బ్రాండింగ్ చేసి దీన్ని మార్కెట్ చేస్తుంటాయి. అయితే వీటిని పాపులర్ చేయటానికి మార్కెటింగ్‌పై ఎక్కువగా ఖర్చు పెట్టవు. సాధారణంగా వీటిని బల్క్‌గా ప్రభుత్వాలకు, ఆసుపత్రులకు సరఫరా చేయడానికి తయారుచేస్తారు. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అబాట్ వంటి పెద్ద కంపెనీల జనరిక్ సాల్ట్ మందుల కన్నా వీటి ధర కాస్త ఎక్కువగా.. పాపులర్ బ్రాండెడ్ కన్నా చౌకగా దొరుకుతాయి.
 3. పాపులర్ బ్రాండ్: వీటిని పుష్కలంగా నిధులున్న బడా సంస్థలే  తయారు చేస్తుంటాయి. అంటే ఒక బ్రాండ్ పేరుతో వీటిని ఉత్పత్తి చేసి ఊరుకోకుండా... దాని ప్రచారానికి నిధులను ఖర్చుచేస్తాయి. డాక్టర్ల సిఫారసులతో మందుల షాపుల్లో విక్రయించడానికే వీటిని తయారు చేస్తాయి. వీటి ఖరీదు చాలా ఎక్కువ.
కొన్ని సందర్భాల్లో ఒకే కంపెనీ ఒక ఔషధాన్ని జనరిక్ సాల్ట్‌గాను, పాపులర్ బ్రాండ్‌గాను, పాపులర్ కాని బ్రాండ్‌గా కూడా విడుదల చేస్తుంటుంది. అంటే తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు ఏ ధరలో మందు కొనాలన్నా ఆ కంపెనీయే అమ్ముతుంది. అనుబంధ విభాగాల పేరిట వీటిని మార్కెట్ చేస్తుంటారు.

 ధరల్లో తేడాలెందుకు?
 జనరిక్స్‌లో రకాల మాట పక్కనబెడితే అసలు ధరల్లో ఇన్ని తేడాలెందుకనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పేవారే లేరు. తమ పేరు బయటకు రావద్దనే షరతుమీద కొందరు కొన్ని నిజాలు చెబుతుంటారు. రాష్ట్రంలో అతి పెద్ద ఫార్మా కంపెనీని నిర్మించిన తొలితరం పారిశ్రామికవేత్త ఒకరు తన చివరి రోజుల్లో అనధికారికంగా కొన్ని విషయాలను చెబుతుం డేవారు. ఫార్మా అనేది విష వలయంలా మారి పోయిందని చెప్పేవారు. కొందరు పెద్ద పదవుల్లో ఉన్న వైద్యులు మందుల ధరలకు సం బంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నా... నిర్మాణాత్మకంగా అడుగులేసేవారు మాత్రం తక్కువ.

 (అసలు ఇండియాలో జనరిక్స్ పరిస్థితేంటి? చట్టాలేం చెబుతున్నాయి? అమెరికాలాంటి చోట్ల పరిస్థితేంటి? అక్కడివారికి మందుల్లో ఎందుకంత పొదుపవుతోంది? రేపటి సంచికలో..)
 
 ఏ కంపెనీ అయినా తయారీకయ్యే ఖర్చుల్ని బట్టే ధర నిర్ణయిస్తుంది. లాభాలనేవి అమ్మకాలపై ఆధారపడతాయి కాబట్టి..
 అమ్మకాల్ని పెంచుకునేందుకు వివిధ మార్గాల్ని అనుసరిస్తుంటారు. అవి..

 
 1) నైతిక ప్రచారం (ఎథికల్ ప్రమోషన్): ఈ పద్ధతి పాటించే ఏ కంపెనీకైనా రాష్ట్రం మొత్తానికి సీ అండ్ ఎఫ్ ఏజెంట్ ఉంటారు. తన పరిధిలో 25-30 మంది డిస్ట్రిబ్యూటర్లకు, వారి నుంచి రిటైల్ షాపులకు మందులు సరఫరా అవుతాయి. సాధారణంగా సీ అండ్ ఎఫ్ ఏజెంట్‌కు 2 శాతం, డిస్ట్రిబ్యూటర్లకు 8-10 శాతం, రిటైలర్లకు 18-20 శాతం కమీషన్ ఉంటుంది. అంటే మొత్తమ్మీద 30-35 శాతం కమీషన్లే. ఇక కంపెనీలే రోగుల చేత వాటిని కొనిపించేందుకు తమ సేల్స్ సిబ్బందిని రంగంలోకి దించుతాయి. ఆ సిబ్బంది వైద్యులకు రకరకాల బహుమతులు ఇస్తారు. డాక్టర్ స్థాయిని బట్టి, వారి దగ్గరికొచ్చే రోగుల్ని బట్టి దేశీ, విదేశీ పర్యటనలు, ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు, కార్లు వంటివి ఇస్తారు. మొత్తంగా కమీషన్లు, సేల్స్ యంత్రాంగానికయ్యే ఖర్చు, బహుమతుల ఖర్చు, కంపెనీల లాభం, మందుల తయారీ ఖర్చు.. అన్నీ కలసి ధర తడిసిమోపెడు అవుతుంది. అందుకే బ్రాండెడ్ జనరిక్స్ ధర ఎక్కువగా ఉంటుంది.

 2) నేరుగా విక్రయించే జనరిక్స్: పేరులేకుండా విక్రయించే జనరిక్ సాల్ట్‌లకు (ఔషధం పేరు) సేల్స్ యంత్రాంగం, డాక్టర్ సిఫారసు ఉండ వు. వీటి అమ్మకాల కోసం కంపెనీలు మెడికల్ షాపులపైనే ఆధారపడతాయి. వీటిపై ముద్రించే ధర కొంత ఎక్కువే ఉంటుంది. మెడికల్ షాపులకు 70-80% డిస్కౌంట్ ధరకే ఇస్తారు. షాపులు వీటిని 50- 60% తక్కువ ధరకు అమ్మవచ్చు. కానీ చాలా దుకాణాల వారు వాటిపై ముద్రించిన ధరనే వసూలు చేస్తారు. ప్రత్యేకంగా కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన జనఔషధి స్టోర్లు, నవభారత్ నిర్మాణ్ వంటి మందుల షాపులు జనరిక్స్‌ను తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి.
 3) పీ అండ్ డీ... (ప్రాపగండా అండ్ డిస్ట్రిబ్యూషన్): కొన్ని కంపెనీలకు స్టాకి స్ట్‌లు సైతం ఉండరు. ఇవి తమ ఉత్పత్తుల్ని విక్రయించడానికి ప్రచారం, పంపిణీ మార్గాన్ని అనుసరిస్తాయి. అంటే సొంత మెడికల్ షాపులున్న వైద్యులను, ఆసుపత్రులను ఇవి ఉపయోగించుకుంటాయి. తమ ఉత్పత్తులను విక్రయించాల్సిందిగా నేరుగా వారికే ఇస్తాయి. ఆ డాక్టరు స్థాయిని బట్టి వారికి ముందే ఏక మొత్తంగా డబ్బు ముట్టజెబుతాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉండదు గనుక అందుకు పెట్టే ఖర్చులో కొంత డాక్టరుకే ముడుపులిస్తాయన్న మాట. దీంతో సదరు వైద్యుడు తన దగ్గరకొచ్చే రోగులకు ఆ మందులే రాస్తారు. అవి ఆ షాపులోనే దొరుకుతాయి. దగ్గర్లోని మరో షాపులో వాటిని విక్రయించకూడదన్న షరతు మీదే వాటిని ఆ డాక్టరు విక్రయిస్తాడు. పైగా వీటి విక్రయాల్లో కమీషన్ కూడా ఎక్కువే.

 తక్కువకు విక్రయించకపోవటమే సమస్య
 సాధారణంగా అవసరమయ్యే చాలా మందులకు జనరిక్స్ ఉన్నాయి. అవి అన్ని షాపుల్లోనూ దొరుకుతాయి. కానీ జనఔషధి, నవభారత్ నిర్మాణ్ వంటివి మినహా చాలా దుకాణాలు జనరిక్స్‌ను కూడా వాటిపై ముద్రించి ఉన్న ధరకే విక్రయించటంతో సమస్య తలెత్తుతోంది. వినియోగదారుడు జనరిక్స్ కొనాలనుకున్నా అవి తక్కువ ధరకు అందే పరిస్థితి ఉండడం లేదు. డాక్టర్లకు సొంత మెడికల్ షాపులున్నచోట పరిస్థితి మరీ దారుణం. ఉదాహరణకు అత్యవసరంగా చేసే మెరోపెనెమ్ ఇంజెక్షన్ ధర రూ.2,800 వరకూ ఉంది. రోజుకు రెండు డోసులివ్వాలి. అత్యవసర మందు గనుక వైద్యులు తమ షాపులోని జనరిక్‌నే ఇస్తుంటారు. రూ.200-300కు దొరికే ఈ జనరిక్‌కూ రూ.2,800 వసూలు చేస్తుండడం దారుణం. అలాగే పైపరాసిల్లిన్ ప్లస్ టాజోబాక్టమ్ మందులు కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు వాడేవే. వీటి ధర రూ.250-300 వరకు ఉంటుంది. కానీ జనరిక్ రూ. 50కే దొరుకుతుంది. వైద్యులు వీటి విషయంలోనూ ఇలాగే చేస్తున్నారు.
 
 జనరిక్స్‌కు సంబంధించి ఈ కథనాలపై మీ అనుభవాలు, అభిప్రాయాలను మాకు సాక్షిహెల్త్15@ జీమెయిల్ ద్వారా మెయిల్ చేయొచ్చు

మరిన్ని వార్తలు