జర్మనీకి షాకిచ్చిన బ్రెజిల్

21 Aug, 2016 10:57 IST|Sakshi
జర్మనీకి షాకిచ్చిన బ్రెజిల్

రియో డిజెనీరో: నేమర్ మెరుపులతో బ్రెజిల్‌ మెరిసింది. సొంత గడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారిగా ఫుట్‌బాల్‌ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. శనివారం మారకనా మైదానంలో  జరిగిన ఫైనల్‌ పోరులో జర్మనీని ఓడించిన బ్రెజిల్ పసిడిని ముద్దాడింది. బ్రెజిల్ షూటౌట్‌లో 5-4తేడాతో జర్మనీపై గెలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు తలో గోల్ నమోదు చేయకపో్వడంతో షూటౌట్ అనివార్యమైంది. ఇందులో జర్మనీని నిలువరించిన బ్రెజిల్ చాంపియన్గా అవతరించింది.దాంతోపాటు రెండేళ్ల కిందట సొంతగడ్డపై జరిగిన ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌లో జర్మనీ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆ వరల్డ్ కప్ లో బ్రెజిల్ 1-7 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది.

 

ఫైనల్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ స్టార్ ఆటగాడు నేమర్‌ ఆద్యంతం రాణించాడు. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రీకిక్ ద్వారా గోల్ చేసి బ్రెజిల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే, 59వ నిమిషంలో జర్మనీ కెప్టెన్ మాక్స్ మెయర్‌ గోల్‌ చేయడంతో స్కోరు సమమైంది. ఆ తరువాత బ్రెజిల్-జర్మనీలు తమ డిఫెన్స్తో ఆకట్టుకోవడంతో నిర్ణీత వ్యవధిలో మరో గోల్ రాలేదు. ఆపై మరో ఆరు నిమిషాలు అదనపు సమయంలో ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ నిర్వహించారు

 

పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ ఆటగాడు ఒకసారి విఫలమవ్వగా.. బ్రెజిల్ ఐదుసార్లు గోల్ చేసింది. దీంతో 5-4 తేడాతో బ్రెజిల్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌ ఫుట్‌బాల్‌ గేమ్‌లో బ్రెజిల్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో మూడుసార్లు(1984, 88, 2012 ) ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన బ్రెజిల్ రజతంతో సంతృప్తి పడింది. కాగా నాల్గో ప్రయత్నంలో స్వర్ణాన్ని సాధించడంలో  బ్రెజిల్ సఫలమై తమ  దేశంలో అభిమానులకు రెట్టింపు జోష్ను అందించింది.

మరిన్ని వార్తలు