జాతీయం, అంతర్జాతీయం.. సంక్షిప్తంగా...

21 Apr, 2015 04:39 IST|Sakshi

తెగబడిన పాక్: జమ్మూలోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆదివారం రాత్రి పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. హీరానగర్ సెక్టార్‌లో మోర్టార్లతో గుళ్ల వర్షం కురిపించాయి. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళాలు అక్కడ భారీగా మోహరించాయి. పాక్ రేంజర్ల కాల్పులకు ప్రతిగా స్పందించడంతో అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింది.
    చైనా గనిలోకి వరదనీరు.. ఏడుగురు మృతి:  చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలో ఉన్న జెయింగ్‌జివాన్ బొగ్గు గనిలోకి వరద నీరు రావడంతో ఆదివారం ఏడుగురు కార్మికులు మరణించారు. 17 మంది చిక్కుకున్నారు.  గనిలో 247 మంది కార్మికులు పనిచేస్తున్నారని, 223 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.
    పాన్‌కు ఆధార్ లేదా ఓటరుకార్డు చాలు: పాన్‌కార్డు పొందే ప్రక్రియలో వ్యక్తి గుర్తింపునకు సంబంధించి వివిధ ధ్రువపత్రాల అవసరం లేకుండా ఆదాయపన్ను శాఖ నిబంధనలను సరళీకృతం చేసింది. పాన్‌కార్డు కావాలనుకునే వ్యక్తి గుర్తింపు కోసం కేవలం ఆధార్ కార్డు లేదా ఓటరు కార్డు సమర్పిస్తే సరిపోతుందని చెప్పింది.
    నేటి నుంచి చార్‌ధామ్ యాత్ర: చార్‌ధామ్ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తెరవడం ద్వారా ఈ యాత్ర మొదలు కాబోతోంది.
    రాజపక్సకు ‘అవినీతి ఆరోపణల’ సమన్లు: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స(69)కు ఆ దేశ అవినీతి ఆరోపణల విచారణ కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశింది.  
    ఐరాస బస్సుపై ఉగ్రదాడి.. 10 మంది మృతి: సొమాలియాలోని గారోవేలో సోమవారం అల్‌కాయిదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ ఉగ్రవాదులు ఐక్యరాజ్య సమితి సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో బాంబును అమర్చి పేల్చేశారు. ఇందులో 10 మంది మృతిచెందారు.
    బెంగళూరులోకి ఓవైసీ ప్రవేశంపై నిషేధం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏప్రిల్ 24 నుంచి 28 వరకూ బెంగళూరులో ప్రవేశించరాదని, ఆడియో-విజువల్ మీడియా ద్వారా కూడా ప్రసంగించరాదని నిషేధం విధించినట్లు పోలీసులు వెల్లడించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 144(3) ప్రకారం నిషేధం విధించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు