మిగులు కృష్ణార్పణం

30 Nov, 2013 00:33 IST|Sakshi
మిగులు కృష్ణార్పణం
  •  బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్  తీర్పుతో రాష్ట్రానికి తీరని నష్టం
  •  మనకు దక్కాల్సిన మిగులు జలాలు ఎగువ రాష్ట్రాలకు పంపిణీ
  •  కొంపముంచిన 65 శాతం డిపెండబిలిటీ విధానం
  •  కృష్ణా పరిధిలో ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం
  •  
    బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే.. రాష్ట్ర రైతుల పరిస్థితి ఏమిటి? సాధారణ వర్షపాతం నమోదయ్యే సమయాల్లో రాష్ట్రానికి కృష్ణా నీరు వస్తుందా? ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పడం కష్టమే! కొత్త తీర్పు అమల్లో లేని సమయాల్లోనే కృష్ణా బేసిన్‌లో తీవ్ర నీటి కొరత నెలకొంటోంది. మిగులు జలాలు కాదు కదా.. నికర జలాలు రావడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొత్త తీర్పు ప్రకారం మిగులు జిలాలు, 65 శాతం డిపెండబులిటీ పద్ధతిన పంచిన నీటిని కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకోవడం మొదలు పెడితే.. దిగువన ఉన్న మనకు తీరని నష్టం వాటిల్లనుంది. భారీ వరదలు వస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరందివ్వడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
     
     65 శాతం డిపెండబిలిటీతో నష్టం ఇలా..
     ఇప్పుడు అమలవుతున్న పద్ధతి ప్రకారం కృష్ణా నది నుంచి కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. కొత్త తీర్పు అమల్లోకి వస్తే... అదనంగా మరో 254 టీఎంసీలు అంటే... మొత్తం 1,573 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మేర దిగువన ఉన్న మన రాష్ట్రానికి నీటి ప్రవాహం తగ్గనుంది. ఈ 254 టీఎంసీలు అంటే... మన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి పరిమాణంతో సమానం. వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో మన రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాల్సి వస్తోంది. అప్పటివరకు నీరు రాకపోతే పంటల సాగు సీజన్ కూడా ముగిసిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈసారి మాత్రమే సరైన వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండాయి. అంతకుముందు వరుసగా సాగర్, డెల్టా ఆయకట్టు రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి వచ్చింది.
     
      ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపుల్ని పెంచడానికి వీలుగా ట్రిబ్యునల్ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. నదుల్లో నీటి లభ్యతలను అంచనా వేయడానికి వీలుగా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం అమలవుతున్న పద్ధతి 75 శాతం డిపెండబిలిటీ మాత్రమే. అంటే వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన ప్రవాహాన్ని సరాసరిగా తీసుకుని నీటిని అంచనా వేస్తారు. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీని పరిగణనలోకి తీసుకుంది. అంటే వందేళ్లలో 65 ఏళ్లల్లో వచ్చిన నీటిని సరాసరిగా పరిగణిస్తారు. దాంతో నదుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పద్ధతిన కర్ణాటకకు 61 టీఎంసీలు, మహారాష్ట్రకు 43 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. అలాగే 112 ఏళ్లల్లో వచ్చిన సరాసరి నీటిని పరిగణనలోకి తీసుకోవాలని మనం కోరితే.. ట్రిబ్యునల్ మాత్రం 47 సంవత్సరాల్లో వచ్చిన వరదను సరాసరి నీటిగా పరిగణనలోకి తీసుకుంది. దీనివల్ల కూడా మనకు తీరని అన్యాయం జరిగింది.
     
     ‘మిగులు’ను పంచేసిన ట్రిబ్యునల్..
     గత బచావత్ ట్రిబ్యునల్... మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన మనకు ఇచ్చింది. కరువొచ్చినా... వరదలు వచ్చినా నష్టపోయేది దిగువ రాష్ర్టమేనన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుత ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసేసింది. మొత్తం 285టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి, వాటిల్లో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది. ఈ నీటిని ఆధారం చేసుకునే మన రాష్ర్టంలో పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ నీటిని పంపిణీ చేయడంతో దిగువకు వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోనుంది. అలాగే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల కూడా దిగువకు సకాలంలో నీరు రాదు. ఇప్పటివరకు 173 టీఎంసీల వాడకమే ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వాడకం భవిష్యత్తులో 303 టీఎంసీలకు పెరగనుంది. అంటే దిగువకు రావాల్సిన 130 టీఎంసీల నీరు కర్ణాటక వాడుకోవడానికి అవకాశం ఏర్పడనుంది. దాంతో మన ప్రాజెక్టుల పరిధిలోని ఖరీఫ్ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.
మరిన్ని వార్తలు