నర్గీస్‌ కే నిర్దోషి

27 Mar, 2017 03:33 IST|Sakshi
నర్గీస్‌ కే నిర్దోషి

బాలుని మృతి కేసు నుంచి
ఇరానీ మహిళకు విముక్తి


రాయగడ: ఓ బాలుని మృతి కేసులో ఇరాన్‌ దేశానికి చెందిన మహిళకు విముక్తి కలిగింది. ఈ కేసుకు సంబంధించి శనివారం ఏడీజే కోర్టు తీర్పు వెలువరించడంతో నర్గీస్‌ కే ఆస్తారి నిర్దోషిగా విడుదలయ్యారు. వివరాలు ఇలావున్నాయి. రాయగడ జిల్లా ముకుందపూర్‌లో ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో ఇరాన్‌ దేశానికి చెందిన నర్గీస్‌ కే ఆస్తారి పనిచేస్తున్నారు. బ్రిటీష్‌ చార్టిబుల్‌ ట్రెస్టులో ఉంటున్న ఓ బాలుని మృతి కేసులో ఈమె నిందితురాలిగా ఆపాదించబడి దోషిగా నిర్ణయించడంతో జైలు కెళ్లారు.

ఈ కేసు మొదట సబ్‌ జడ్జికోర్టులో విచారణ కాగా అప్పట్లో అధికారుల విచారణ ఆధారంగా సబ్‌ జడ్జి నర్గీస్‌ను దోషిగా గుర్తించి రూ. 3 లక్షల జరిమానా,సంవత్సరం జైలు శిక్షను విధించారు. దీనిని సవాల్‌ చేస్తూ నర్గీస్‌ కే ఆస్తారి ఏడీజే కోర్టులో పిటీషన్‌ వేయగా తుది తీర్పులో నిర్దోషిగా విడుదలయ్యారు. కాగా ఆమె గత రెండు సంవత్సరాలుగా పడిన ఇబ్బందుల దృష్ట్యా నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద కోరవచ్చునని తీర్పు ఇచ్చారు. ఆస్తారి(28)పై 2014లో కేసు నమోదు అయింది.

 ముకుందపూర్‌లోని ప్రిషాన్‌ ఫౌండేషన్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేశారు. 2014లో నాగావళి నదికి ప్రిషాన్‌ ఫౌండేషన్‌ పిల్లలు పిక్నిక్‌కు వెళ్లారు. అందులో ఆరుగు పిల్లలు నదిలో స్నానం చేస్తుండగా ఆసీంజిలకర్ర అనే బాలుడు నదిలో కొట్టుకుపోగా మిగిలిన ఐదుగురు రక్షించబడ్డారు. 3.11.2014న ఈ ఘటన జరిగింది. దీనిపై బాలుని తల్లిదండ్రులు కలెక్టర్, ఎస్పీ, ఒడిశా మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కోర్టులో విచారణ జరుపగా నర్గీస్‌కే ఆస్తారి నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందినట్లు అప్పట్లో సబ్‌ జడ్జి తీర్పుఇచ్చారు. ఈ మేరకు ఆమె జైలు శిక్ష అనుభవించారు. అయితే తుది తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చి నిర్దోషిగా విడుదలయ్యారు.

మరిన్ని వార్తలు