ముంబైలో బ్రిటన్ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన

22 Oct, 2013 09:11 IST|Sakshi

ముంబై మహానగరంలోని ఒషివారా ప్రాంతంలో బ్రిటన్ మహిళ (26) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి (36)ని సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి మంగళవారం ఇక్కడ వెల్లడించారు. నిందితుడిపై ఐపీసీ 354 సెక్షన్పై మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

 

పోలీసులు కథనం ప్రకారం... సోమవారం సాయంత్రం బ్రిటన్ మహిళ మరో ఇద్దరు మహిళలతో కలసి ఆటోలో ప్రయాణిస్తూ శ్రీజీ హోటల్ సమీపంలోకి చేరుకున్నారు. ఆ సమయంలో నిందితుడు బ్రిటన్ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ముగ్గురు మహిళలు గట్టిగా అరిచారు. నిందితుడు బయపడి పరుగు లంకించుకోవడంతో స్థానికంగా గస్తీ తరుగుతున్నపోలీసు కానిస్టేబుళ్లు అప్రమత్తం అయ్యారు. నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు.

 

నిందితుడు మీరా రోడ్డు ప్రాంతంలో నివసిస్తాడని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. అయితే బ్రిటన్ మహిళ ఏడాది నుంచి ముంబై నగరంలో నివసిస్తుందని తమతో తెలిపిందని ఆయన వెల్లడించారు. బాలీవుడ్ చిత్రాల్లో ఎక్సెట్రా డాన్సర్గా ఉంటూ జీవనం సాగిస్తుందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు