విలీనం దిశగా..యడ్డీ

4 Jan, 2014 12:23 IST|Sakshi
విలీనం దిశగా..యడ్డీ

 బీజేపీ నుంచి వైదొలగి తప్పు చేశానన్న యడ్డి    
 రాజ్యాంగ పర చర్యలకు యడ్యూరప్ప శ్రీకారం
 తన ఎమ్మెల్యేల సహా అసెంబ్లీ స్పీకర్‌తో భేటీ     
 విలీనం పత్రాలు అందజేత
 ప్రజలు క్షమించాలని వేడుకోలు
 మోడీని పీఎం చేయడమే లక్ష్యమని స్పష్టీకరణ
 జేడీఎస్‌కు దూరంకానున్న ప్రధాన విపక్ష హోదా


 
 బెంగళూరు : బీజేపీలో కేజేపీని విలీనం చేయడానికి సమ్మతించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శుక్రవారం ఆ దిశగా రాజ్యాంగ పరంగా చేపట్టాల్సిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా శాసన సభ స్పీకర్ కాగోడు తిమ్మప్పను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేజేపీ ఎమ్మెల్యేలు విశ్వనాథ పాటిల్, గురుపాదప్ప నాగమారపల్లి, యూబీ బనకార, మాజీ మంత్రులు శోభా కరంద్లాజె, సీఎం. ఉదాసి ప్రభృులున్నారు. కేజేపీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా పేర్కొనే పత్రాలను ఆయన స్పీకర్‌కు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన బీజేపీ నుంచి వైదొలగి కేజేపీని స్థాపించడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
 
 ఈ తప్పును మన్నించాల్సిందిగా రాష్ట్ర ప్రజలను కోరుతానన్నారు. ప్రస్తుతం ఎవరికి ఎవరు అవసరమనేది అప్రస్తుతమని అన్నారు. దేశ ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశంతోనే తన పార్టీని విలీనం చేశానని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. దీనికి  రాష్ట్రంలో బీజేపీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రమంతా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని వెల్లడించారు. తనకు పార్టీలో ఎటువంటి పదవి అవసరం లేదని, సామాన్య కార్యకర్తగా పని చేసుకుంటూ పోతానని తెలిపారు. త్వరలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలసి విలీనానికి సంబంధించి లాంఛనాలను పూర్తి చేయాలని కోరుతానని వెల్లడించారు. కాగా విలీనంపై బీజేపీ నుంచి కూడా అంగీకార పత్రం అందాక అవసరమైన చర్యలు చేపడతానని స్పీకర్ తెలిపారు.
 
 స్వతంత్రులుగా ఇద్దరు
 కేజేపీ నుంచి ఎన్నికైన వారిలో యడ్యూరప్ప సహా నలుగురు మాత్రమే బీజేపీలో చేరనున్నారు. మిగిలిన ఇద్దరు బీఆర్. పాటిల్, గురు పాటిల్‌లు తటస్థంగా ఉండిపోయారు. వారిద్దరూ స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగే అవకాశాలున్నాయి. బీఆర్. పాటిల్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో స్నేహం ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌లో చేరే ఆలోచన ప్రస్తుతానికి లేదని తెలిపారు.
 
 చరిత్ర పుటల్లోకి కేజేపీ  
 పుట్టిన ఏడాదికే కేజేపీ అంతర్థానమైంది. 2012 డిసెంబరులో హావేరిలో జరిగిన సభలో పురుడు పోసుకున్న కేజేపీ, ఏడాదికే నిండు నూరేళ్లు నిండడం ద్వారా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని అప్పట్లో పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్పినప్పటికీ, యడ్యూరప్ప తనదైన పంథాలో సాగిపోయారు. తనకు అపారమైన రాజకీయ అనుభవం ఉందని,  కేజేపీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆ అనుభవంతోనే చెబుతున్నానని ఢంకా బజాయిస్తూ వచ్చారు. శాసన సభ ఎన్నికల ఫలితాలను చూసి ఆయనే అవాక్కయ్యారు. పది శాతం ఓట్లతో కేవలం ఆరు సీట్లను మాత్రమే తెచ్చుకోగలిగారు. 32 స్థానాల్లో ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీని ఓడించి శపథం నెరవేర్చుకున్నారు. మొత్తానికి ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న వైషమ్యాల వల్ల... ఈ జన్మలో రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని భావిస్తూ వచ్చిన కాంగ్రెస్ రొట్టె విరిగి నేతిలో పడింది.
 
 జేడీఎస్‌కు మూన్నాళ్ల ముచ్చట
 బీజేపీ, కేజేపీ విలీనం జేడీఎస్‌ను ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరం చేయనుంది. గత మేలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. బీజేపీ, జేడీఎస్‌లకు చెరో నలభై సీట్లు లభించాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికనే సందేహం తలెత్తింది. ఇలాంటి సందర్భాల్లో రెండో నిబంధనగా ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. జేడీఎస్‌కు 20.09 శాతం ఓట్లు (62,69,907), బీజేపీకి 19.97 శాతం ఓట్లు (62,32,595) లభించాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష  హోదా జేడీఎస్‌ఏకు దక్కింది. కేజేపీ విలీన ప్రక్రియ పూర్తయితే బీజేపీ సంఖ్యా బలం 44కు పెరుగుతుంది. కనుక సహజంగానే జగదీశ్ శెట్టర్ ప్రతిపక్ష నాయకుడవుతారు.

>
మరిన్ని వార్తలు