నష్టాలే...కానీ ముగింపులో రికవరీ

21 Aug, 2013 10:14 IST|Sakshi
నష్టాలే...కానీ ముగింపులో రికవరీ
రూపాయి 64 దిగువకు పతనం కావడంతో వరుసగా నాలుగోరోజు భారీ క్షీణతతో స్టాక్ సూచీలు మొదలయ్యాయి. అయితే కొద్దిరోజులుగా 6 శాతం పతనమైన నేపథ్యంలో షార్ట్ కవరింగ్ రూపంలో బేర్స్ లాభాల స్వీకరణ జరపడంతో ఈక్విటీలు వేగంగా కోలుకున్నాయి. రూపాయి క్షీణతకు తోడు, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెల నుంచి ఆర్థిక ఉద్దీపనను ఉపసంహరించవచ్చన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు పతనం కావడంతో మంగళవారం ట్రేడింగ్ తొలిదశలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా క్షీణించి 17,970 పాయింట్లస్థాయికి తగ్గింది. షార్ట్ కవరింగ్‌కు తోడు కనిష్టస్థాయిలో వున్న బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో దేశీయ ఫండ్స్ కొనుగోళ్లు జరపడంతో ముగింపు సమయానికి 18,246 పాయింట్ల వద్దకు రికవరీ కాగలిగింది. చివరకు 61 పాయింట్ల స్వల్ప నష్టంతో ముగిసింది. ఇదేరీతిలో ఏడాది కనిష్టస్థాయి 5,306 పాయింట్ల వద్దకు పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రమేపీ కోలుకుని 5,401 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం ముగింపుతో పోలిస్తే 13 పాయింట్లు నష్టపోయింది. కొద్ది నెలలుగా పెరుగుతూ వచ్చిన ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.  
 
 మెటల్ కౌంటర్లలో యాక్టివిటీ.... 
 గత రెండు రోజుల మార్కెట్ భారీగా పతనమైన సందర్భంలో స్థిరంగా ట్రేడయిన మెటల్ షేర్లు మంగళవారం ర్యాలీ జరిపాయి. మెటల్ సూచి 5 శాతం ర్యాలీ జరిపింది. సేసా గోవా, టాటా స్టీల్, సెయిల్, హిందుస్థాన్ జింక్, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, ఎన్‌ఎండీసీలు 3-15 శాతం మధ్య పెరిగాయి.  హిందుస్థాన్ జింక్, బాల్కో  కంపెనీల్లో మిగులు వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించడానికి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయన్న వార్తలతో హింద్ జింక్‌తో పాటు వేదాంత గ్రూప్ కంపెనీలైన సేసా గోవా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్ కౌంటర్లలో క్యాష్‌మార్కెట్లో భారీ కొనుగోళ్లు జరిగాయి. గత డిజిన్వెస్ట్‌మెంట్ సందర్భంగా ప్రభుత్వం నుంచి వాటా కొనడంతో హింద్ జింక్, బాల్కోల్లో మెజారిటీ వాటా ఇప్పటికే వేదాంత గ్రూప్ వద్ద వుంది. అన్నింటికంటే అధికంగా 15 శాతం పెరిగిన సేసా గోవా ఆగస్టు ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 3 శాతం షేర్లు యాడ్ అయ్యాయి. 
 
 మొత్తం ఓఐ 78 లక్షల షేర్లకు చేరింది. అయితే స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ రూ. 7 డిస్కౌంట్‌తో ముగిసింది. క్యాష్ మార్కెట్లో జరిపిన కొనుగోళ్లను హెడ్జ్ చేసుకునే క్రమంలో ఇన్వెస్టర్లు ఫ్యూచర్లో షార్ట్ జరిపినట్లు ఈ డేటా సూచిస్తోంది. అలాగే రూ. 150, రూ. 160 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ జరగడంతో ఈ స్థాయిలు సమీప భవిష్యత్తులో ఈ షేరు పెరుగుదలకు అవరోధం కావచ్చన్నది డేటా విశ్లేషణ.  సేసా గోవా షేరులో విలీనం కాబోయే స్టెరిలైట్ ఇండస్ట్రీస్ కౌంటర్లో షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ ఓఐ నుంచి 8.12 లక్షల షేర్లు (2.74 శాతం) కట్ అయ్యాయి. 5:3 నిష్పత్తిలో జరిగే ఈ విలీన ప్రక్రియకు ఈ నెల 28న రికార్డుతేదీగా నిర్ణయించినందున, 
 
 ఈ కౌంటర్లో షార్ట్ కవరింగ్ జరిగింది. రూ. 80 స్ట్రయిక్ కాల్‌ఆప్షన్‌లో పెద్ద ఎత్తున కవరింగ్ జరగడంతో ఓఐ నుంచి 2 లక్షలకుపైగా షేర్లు కట్ అయ్యాయి. హిందుస్థాన్ జింక్ కాంట్రాక్టులో కూడా షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ ఓఐ 3.21 శాతం తగ్గింది. ఎన్‌ఎండీసీ, హిందాల్కో  కౌంటర్లలో లాంగ్ బిల్డప్‌ను సూచిస్తూ వీటిలో ఓఐ 3.64 శాతం, 9.75 శాతం చొప్పున పెరిగింది. గత 10 సెషన్లలో 30 శాతం ర్యాలీ జరిపిన టాటా స్టీల్ కౌంటర్లో తాజా షార్ట్ కవరింగ్ జరగడంతో ఓఐ నుంచి 5 లక్షల షేర్లు కట్ అయ్యాయి. తొలుత విక్రయించిన కాంట్రాక్టును తిరిగి కొనుగోలు చేయడాన్ని షార్ట్ కవరింగ్‌గానూ, భవిష్యత్తులో మరింత పెరగవచ్చన్న అంచనాలతో తాజాగా కొనుగోలు చేయడాన్ని లాంగ్ పొజిషన్‌గానూ వ్యవహరిస్తారు. 
 
>
మరిన్ని వార్తలు