కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం: మాయావతి

16 Jan, 2014 04:35 IST|Sakshi
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం: మాయావతి

లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, కాంగ్రెస్, బీజేపీ సహా ఏ పార్టీతోనూ, ఏ కూటమితోనూ కలవబోమని  బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. దేశవ్యాప్తంగా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఆమె బుధవారం లక్నోలో ‘సావ్‌ధాన్ విశాల్ మహార్యాలీ’తో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బుధవారమే మాయావతి పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఈ సభలో మాయావతి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుం డా దేశమంతటా కూడా తాము ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమన్నారు. కాంగ్రెస్‌తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు.
 
 ఈ సందర్భంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపైనా విమర్శలు చేశారు. ‘ఆరు కోట్ల మంది ఉన్న గుజరాత్‌కు సీఎంగా ఉన్న మోడీ గోధ్రాలో హిందూ, ముస్లింల మధ్య దాడులను నిరోధించలేకపోయారు. అలాంటి ఎన్నో మతాలు, కులాల మధ్య ఐక్యతను ఎలా తీసుకొస్తారు?  ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, పిల్లల పరిస్థితి దారుణంగా ఉందని కాగ్ నివేదికలోనే ఎత్తిచూపింది. ద్రవ్యోల్బణాన్ని, అవినీతిని నియంత్రిస్తాం.. నిరుద్యోగాన్ని తగ్గిస్తామంటూ మోడీ వాగ్దానాలు గుప్పిస్తున్నారు. కానీ, ఎక్కువగా ఉరిమే మేఘాలు వర్షించవనేది ఆయనకు సరిగా సరిపోతుంది’’ అని మాయావతి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు