అక్రమంగా కట్టారని మసీదుకు నిప్పు పెట్టారు

2 Jul, 2016 16:03 IST|Sakshi
అక్రమంగా కట్టారని మసీదుకు నిప్పు పెట్టారు

మయన్మార్‌లో బుద్ధిస్టుల తీవ్ర చర్య

నేపీతా: మయన్మార్‌లో జాతుల హింస కొనసాగుతూనే ఉంది. దేశంలో జాతుల హింసను అరికట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్‌ యాంఘీ లీ మయన్మార్‌ ప్రభుత్వాన్ని కోరిన రోజే.. బుద్ధిస్టులు ఓ మసీదుకు నిప్పుపెట్టారు.

దేశ రాజధాని నేపీతాకు 652 కిలోమీటర్ల దూరంలో ఉన్న హపకంత్ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలో అక్రమంగా కట్టిన ముస్లింల ప్రార్థన మందిరాన్ని కూల్చేయాలని బుద్ధిస్టులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముస్లింలు మాత్రం అధికారులు ఆదేశాలిస్తేనే తాము ప్రార్థన మందిరాన్ని తొలగిస్తామని చెప్తూ వచ్చారు. ఈ అంశంపై ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం వందలమంది బుద్ధిస్టులు కత్తులు, కర్రలు పట్టుకొని వచ్చి ప్రార్థన మందిరం ముందు ఆందోళనకు దిగారు. అదుపు తప్పిన అల్లరిమూక ప్రార్థన మందిరానికి నిప్పు పెట్టింది. అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా.. వారిని కూడా అల్లరిమూక అడ్డుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు రేపింది.

మరోవైపు మయన్మార్ పర్యటనకు వచ్చిన ఐరాస రిపోర్టర్ లీ దేశంలో ఏళ్లుగా కొనసాగుతున్న మైనారిటీ ముస్లిం-బుద్ధిస్టు జాతుల మధ్య హింసను నివారించాలని ప్రజాస్వామిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత 50 ఏళ్లలో తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం మయన్మార్‌లో నెలకొన్న నేపథ్యంలో జాతుల హింసకు చెక్ పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
 

>
మరిన్ని వార్తలు