‘సమూహ’కు కంపెనీల రాక..

30 Nov, 2015 01:17 IST|Sakshi
‘సమూహ’కు కంపెనీల రాక..

నిర్మాణం మొదలుపెట్టిన 7 సంస్థలు
రెండేళ్లలో సమూహ కంపెనీల ప్లాంట్లు
తొలి దశలో రూ.500 కోట్ల పెట్టుబడి
సాక్షితో సమూహ ఈడీ శ్రీరామ్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి అవసరమైన పరికరాల తయారీకై హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్ల వద్ద ఉన్న సమూహ ఏరోస్పేస్ పార్కులో కంపెనీల రాక ప్రారంభమైంది. ప్రస్తుతం ఏడు కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించాయి. వీటిలో అనంత్ టెక్నాలజీస్, హెమెయిర్ సిస్టమ్స్, ఎస్‌కేఎం టెక్నాలజీస్, లాజికల్ సొల్యూషన్స్, మయన్ టెక్నాలజీస్, గౌర టెక్నాలజీస్, మోషన్ డైనమిక్స్ ఉన్నాయి. ఇందులో రెండు కంపెనీలు ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు సమాచారం. వీటితోపాటు ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్, జెటాటెక్ ఇండస్ట్రీస్, స్కార్లెట్ ఇండస్ట్రీస్, ఏరోక్ స్పేస్ టెక్నాలజీస్, కంప్యూ పవర్, అపోలో సిస్టమ్స్ ఒకట్రెండు నెల ల్లో యూనిట్ల నిర్మాణాన్ని మొదలు పెట్టనున్నాయి. పార్కులో రెండేళ్లలో అన్ని సంస్థల ప్లాంట్లు సిద్ధం కానున్నాయి.

తొలి దశలో రూ.500 కోట్లు..
డిఫెన్స్, ఏరోస్పేస్, న్యూక్లియర్ రంగాల్లో అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాలను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఎంటీఏఆర్ టెక్నాలజీస్, జెటాటెక్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్, స్కార్లెట్ ఇండస్ట్రీస్, ఎస్‌కేఎం టెక్నాలజీస్ ప్రమోటర్లుగా, మరో 21 కంపెనీలు వాటాదారులుగా సమూహ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటైంది. ఈ సంస్థ సమూహ ఏరోస్పేస్ పార్కును ప్రమోట్ చేస్తోంది. ఇలా పార్క్ ఏర్పాటవడం దేశంలో ఇదే తొలిసారి. భాగస్వామ్య కంపెనీలన్నీ రెండేళ్లలో తమ ప్లాంట్లను నిర్మిస్తాయని సమూహ ఈడీ, స్కార్లెట్ ఎండీ శ్రీరామ్ ఎంఎం సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలు తొలి దశలో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడులు పెడతాయని చెప్పారు. పార్కు పూర్తి రూపాన్ని సంతరించుకుంటే రక్షణ అవసరాలన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుందని అన్నారు.
 
దేశంలో తొలిసారిగా..
 తెలంగాణ ప్రభుత్వం డిఫెన్స్, ఏరోస్పేస్ పరికరాల తయారీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ఈ రంగానికి ప్రత్యేక పాలసీని మార్చికల్లా సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి కంపెనీలతో భాగస్వామ్యానికి ఉత్సాహం కనబరుస్తున్నాయని సమూహ డెరైక్టర్, ఎస్‌ఈసీ ఎండీ డి.విద్యాసాగర్ తెలిపారు. ఇక్కడ జరుగుతున్న డిఫెన్స్, ఏరోసప్లై సదస్సు ప్రభుత్వ లక్ష్యానికి మరింత విలువను చేకూరుస్తుందన్నారు. 200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న సమూహ పార్కులో ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 18,000 మందికి ఉపాధి లభించనుందని అంచనా. 30-40 కంపెనీలకు నేరుగా, 200-300ల చిన్న యూనిట్లకు పరోక్షంగా పనులు లభిస్తాయని సమూహ భావిస్తోంది.
 

 

మరిన్ని వార్తలు