రాష్ట్రంలో బంగీ జంప్!

12 Feb, 2016 06:54 IST|Sakshi
రాష్ట్రంలో బంగీ జంప్!

సాక్షి, హైదరాబాద్: బంగీ జంప్.. నడుముకు తాడులాంటి దాన్ని కట్టుకుని అంతెత్తు నుంచి కింద ఉన్న నీటిలోకి దూకే ఓ సాహస విన్యాసం. మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేనప్పటికీ విదేశాల్లో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే సాహస క్రీడ. ఇప్పుడలాంటి అద్భుత అవకాశం మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తోంది. అయితే, విదేశాల్లో ఉన్నట్టుగా ఏ కొండ అంచు నుంచో దూకేలా మాత్రం కాదు. అలనాడు నిజాం జమానాలో  రూపుదిద్దుకుని వయసైపోయి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఓ పురాతన వంతెన పైనుంచి.

సాహస క్రీడలంటే ఎంతో ఆసక్తి చూపే యువతను ఆకట్టుకునేందుకు రాష్ట్రంలో అడ్వెంచర్ టూరిజంను అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం.. ఈ వంతెనను అందుకు వేదిక చేసుకోవాలని నిర్ణయించింది.
 
ఆర్మూరు-నిర్మల్ మధ్య సోన్ వద్ద గోదావరిపై 1936లో ఓ భారీ వంతెనను నిర్మించారు. కిలోమీటరుకు మించిన పొడవున్న ఈ వంతెన నిర్మాణ కౌశలం కూడా కళాత్మకంగా ఉంటుంది. ఇంతకాలం సేవలందించిన ఈ వంతెన వయసైపోయిందన్న ఉద్దేశంతో ప్రభుత్వం దానికి సమాంతరంగా కొత్త వంతెనను నిర్మించి వినియోగంలోకి తెచ్చింది. ప్రస్తుతం పాత వంతెన మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. కానీ ఇప్పటికీ అది పటిష్టంగానే ఉంది.

దిగువన గోదావరి, చుట్టూ అందమైన ప్రకృతి, కళాత్మకంగా నిర్మితమై ఉన్న ఆ వంతెనను సాహస క్రీడలకు వినియోగించుకోవాలని ఇటీవల పర్యాటక శాఖ భావించింది. దీనికి ప్రభుత్వం అనుమతించడంతో కార్యాచరణకు సిద్ధమైంది. ఆ వంతెన మీదుగా నదిలోకి మినీ బంగీ జంపింగ్‌కు అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. దీంతోపాటు వంతెన దిగువన నుంచి పైకి రాక్ క్లైంబింగ్‌లాంటివి ఏర్పాటు చేయనున్నారు. వంతెన మీద ఆ ప్రాంత సంప్రదాయాల్ని ప్రతిబింబించే ప్రదర్శనలు, చేతి వృత్తుల ఉత్పత్తులతో ప్రదర్శనలు, ఇతర మేళాలు ఏర్పాటు చేయనున్నారు.

దాని మీదుగా కేవలం సైక్లిస్టులు, పాదచారులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. త్వరలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఆ వంతెన ప్రాంతాన్ని సందర్శించి స్థానిక అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ప్రస్తుతం దిగువన గోదావరిలో నీళ్లు లేవు. వచ్చే వానాకాలంలో నీళ్లు చేరిన తర్వాత అవి ఎప్పుడూ నిల్వ ఉండేలా దిగువన మినీ రబ్బర్ డ్యాం నిర్మించే యోచనలో ఉన్నారు.

మరిన్ని వార్తలు