ఆ ఎన్‌కౌంటర్‌ యాక్సిడెంటలా?

31 Jul, 2016 09:40 IST|Sakshi

శ్రీనగర్‌: వాటెండ్‌ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌ జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. బుర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌పై తాజాగా డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత నిర్మల్ సింగ్ కూడా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌ యాక్సిడెంట్‌ (యాదృచ్ఛికం) మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ముందే సమాచారం అంది ఉంటే తాము ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని ఉండేవాళ్లమని ఆయన పేర్కొన్నారు.

సీఎం మెహబూబా ముఫ్తి గతంలో ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతనాగ్‌ జిల్లాలోని బాందూరా గ్రామంలో భద్రతా దళాలు ఆపరేషన్‌ చేపట్టిన ఇంట్లో బుర్హాన్ వని ఉన్నాడని తమకు ముందుగానే తెలిసి ఉంటే, అతనికి భద్రతా దళాలు ఒక అవకాశం (లొంగిపోయేందుకు?) ఇచ్చి ఉండేవని ఆమె పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో గతంలో బీజేపీ విభేదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నిర్మల్‌ సింగ్‌ వ్యాఖ్యలు వివాదం రేపాయి. దీంతో స్పందించిన ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌ తర్వాత కశ్మీర్‌ లోయలో అల్లర్లు చెలరేగి.. 40మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు