సమ్మె సంపూర్ణం

3 Sep, 2015 02:35 IST|Sakshi
సమ్మె సంపూర్ణం

డిపోలకే పరిమితమైన బస్సులు
* హైదరాబాద్‌లో రోడ్డెక్కని 70 శాతం ఆటోలు
* లారీలు తిరగకపోవటంతో స్తంభించిన సరుకు రవాణా
సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రత బిల్లుతోపాటు కార్మిక చట్టాల్లో మార్పులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పది ప్రధాన కార్మిక సంఘాల పిలుపుతో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా జరిగింది. తెలంగాణలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

తెల్లవారుజామున కొన్ని జిల్లా సర్వీసులు రోడ్డెక్కినప్పటికీ ఆ తర్వాత ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు తర్వాత సమ్మె ముగిసినట్టు ప్రకటించటంతో క్రమంగా బస్సులు రోడ్డెక్కాయి. తెలంగాణలో నిత్యం 11,688 బస్సు సర్వీసులు నడవాల్సి ఉండగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 310 సర్వీసులు మాత్రమే నడిచాయి. బస్సులు తిరగకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమ్మెకు ఆటో సంఘాలు, లారీ యజమానుల సంఘం సంపూర్ణ మద్దతు తెలపటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

హైదరాబాద్‌లో ఒక ఆటో సంఘం సమ్మెలో పాల్గొనకపోవటంతో 30 శాతం వరకు ఆటోలు తిరిగాయి. లారీలు, ట్రాలీలు పూర్తిగా నిలిచిపోవటంతో సరుకు రవాణా కూడా స్తంభించింది. సాధారణంగా దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలు రాష్ట్రంలో అంతగా విజయం సాధించే పరిస్థితి ఉండదు. కానీ, ఈసారి రోడ్డు భద్రత చట్టం, కార్మిక చట్టాల అంశాలు ప్రధాన ఎజెండా కావటంతో స్థానిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో సమ్మె విజయవంతమైంది. సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించటంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

రైల్వే సంఘాలు సమ్మెకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించినా.. రైళ్లు మాత్రం యథావిధిగానే నడిచాయి. చాలావరకు బ్యాంకులు యథావిధిగానే పనిచేశాయి. కొన్ని చోట్ల కార్మిక సంఘాల ప్రతినిధులు బ్యాంకులను బలవంతంగా మూసివేయించారు. పలు ప్రాంతాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని కార్మిక ప్రతినిధులు నినదించారు. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు త్వరలో జాతీయ కార్మిక సంఘాలు ఢిల్లీలో నిర్వహించే సదస్సులో ఆర్టీసీ సహా పలు సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయించారు.
 
ఏపీలోనూ సమ్మె సక్సెస్

సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రంలో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె జయప్రదమైంది. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు నిర్వహించాయి. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కర్నూలులో కార్మికులు, పోలీసులకుమధ్య తోపులాట చోటుచేసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన బ్యాంకులు, ఫ్యాక్టరీలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. బుధవారం మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, లారీలు రోడ్లపైకి రాలేదు. నిరసన ర్యాలీలకు సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, మధు, పి.గౌతంరెడ్డి నాయకత్వం వహించారు.
 
రాజధానిలో ప్రశాంతం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ముగిసింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్కూల్ ఆటోలు కూడా బంద్‌లో పాల్గొనడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గ్రేటర్‌లోని 28 డిపోలకు చెందిన సుమారు 3,500 బస్సులు, లక్షకు పైగా ఆటోలు బంద్‌లో పాల్గొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోకల్ రైళ్లపై ఆధారపడి రాకపోకలు సాగించారు. సమ్మె నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిసాయి. మరోవైపు రవాణా బంద్ కారణంగా సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్ వంటి వాహనాలు ప్రయాణికులను నిలువుదోపిడీ చేశాయి.

మరిన్ని వార్తలు