విమానంలో వికృతచేష్ట.. జీవితకాల బహిష్కరణ

15 Nov, 2016 14:32 IST|Sakshi
విమానంలో వికృతచేష్ట.. జీవితకాల బహిష్కరణ

కేప్‌టౌన్‌: అతనో పెద్ద మనిషి. పేరుమోసిన కంపెనీకి అధిపతి. విమానం ఎక్కితే బిజినెస్‌ క్లాస్‌ తప్ప మరోచోట కూర్చుని ఎరగడు. కానీ వ్యవహారం మాత్రం నేరబారుకంటే దారుణం. విధినిర్వహణలో ఉన్న విమాన సహాయకురాలిపై వికృత చేష్టకుదిన అతడిని పోలీసులు అరెస్ట్‌ చేసేశారు. కానీ లంచం కొట్టి, చిటికెలో బయటపడ్డాడు. బ్రిటన్‌, సౌతాఫ్రికాల్లో సంచలనం రేపుతోన్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

బ్రిటన్‌ కు చెందిన మార్టిన్‌ వాన్‌(61) గత అక్టోబర్‌ లో బ్రిటిష్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానంలో కేప్‌ టౌన్‌(సౌతాఫ్రికా) వెళ్లాడు. బిజినెస్‌ క్లాసులో ప్రయాణించిన ఆయన.. ఆహారం వడ్డించేందుకు వచ్చిన విమాన సహాయకురాలిపై వికృతానికి దిగాడు. మార్టిన్‌ పక్క సీట్లో కూర్చున్న వేరొకరికి ఆహారం వడ్డిస్తూ విమాన సహాయకురాలు ముందుకు వంగింది. అదే సమయంలో మార్టిన్‌ ఆమె గౌను కిందుగా ఫోన్‌ ఉంచి వీడియో తీశాడు. ఇది గమనించిన ఆ ఉద్యోగిని మార్టిన్‌ ను నిలదీసింది. ఫ్లైట్‌ కెప్టెన్‌ కు ఫిర్యాదుచేసింది.

కెప్టెన్‌ ఇచ్చిన సమాచారంతో విమానం కేప్‌ టౌన్‌ లో ల్యాండ్‌ అయిన వెంటనే మార్గిన్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్ది సేపటికే అతను బయటపడటం గమనార్హం. మహిళపై వికృతానికి పాల్పడ్డ మార్టిన్‌ పై పిటీ కేసు పెట్టి, కేవలం 13 యూరోలు జరిమాన విధించి వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసింది. మార్టిన్‌ ను అరెస్టుచేసిన పోలీసు.. ఆ తర్వాత సెలవుపై వెళ్లడం లంచం అనుమానాలకు బలమిచ్చినట్లైంది.

దీంతో మొత్తం కేసును పునర్విచారిస్తామని సౌతాఫ్రికా పోలీసులు చెప్పాల్సివచ్చింది. ఇదిలాఉంటే, సదరు నేరానికి పాల్పడ్డ మార్టిన్‌ ను తమ విమానాల్లో ప్రయాణించనివ్వబోమని బ్రిటిష్‌ ఎయిర్‌ లైన్స్‌ ఒక ప్రకటన విడుదలచేసింది. సిబ్బందితో తప్పుగా ప్రవర్తించిన అతడికి శిక్షపడాల్సిందేనని, ఈ మేరకు సౌతాఫ్రికా పోలీసులకు సహకరిస్తామని ఎయిర్‌ లైన్స్‌ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు