సెప్టెంబర్‌లో సీఏ క్యాంపస్ ప్లేస్‌మెంట్

31 Aug, 2013 01:28 IST|Sakshi
సెప్టెంబర్‌లో సీఏ క్యాంపస్ ప్లేస్‌మెంట్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక వృద్ధిరేటు క్షీణిస్తున్నప్పటికీ అన్ని రంగాల నుంచి చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి డిమాండ్ ఉందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐసీఏఐ నిర్వహిస్తున్న క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌కు అన్ని రంగాలకు చెందిన కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోందని, కొన్ని కంపెనీలు గరిష్టంగా రూ.16 లక్షల వార్షిక వేతనం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాయని ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ విజయ్ కుమార్ గుప్తా తెలిపారు.
 
 సెప్టెంబర్10 నుంచి 13వ తేది వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న క్యాంపస్ ఇంటర్వ్యూ విషయాలను తెలియచేయడానికి శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో గుప్తా మాట్లాడుతూ సీఏలకు దేశంలో నాలుగు లక్షల నుంచి రూ.16 లక్షలకు వరకు వేతనం లభిస్తోందని, అదే విదేశాల్లో అయితే రూ.21 లక్షల వరకు వేతనం లభిస్తోందన్నారు. గత సంవత్సరం సగటున రూ.7.11 లక్షల వేతనం లభించినట్లుగా గుప్తా తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్లేస్‌మెంట్ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్, ఎస్‌ఆర్‌బీసీ అండ్ కో, బజాజ్ ఫైనాన్స్, ల్యాంకో వంటి 130 కంపెనీలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు ఐసీఏఐ హైదరాబాద్ చీఫ్ కో-ఆర్డినేటర్ ఎం.దేవరాజ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ మధ్యనే సీఏ కోర్సును పూర్తి చేసిన 5,000 మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని, గడిచిన సంవత్సరం జరిగిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు