‘అందరికీ ఇల్లు’ షురూ

18 Jun, 2015 01:12 IST|Sakshi
ఢిల్లీలో కేటినెట్ భేటీ తర్వాత మాట్లాడుతున్న కేంద్ర మంత్రులు వెంకయ్య, సదానంద, బీరేందర్ సింగ్

కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం : పట్టణ ప్రాంత పేదల కోసం జాతీయ పట్టణ గృహ నిర్మాణ పథకం ప్రారంభం
అల్పాదాయ వర్గాలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు 6.50 శాతం వడ్డీ రాయితీ
ఈ నిర్ణయంతో రూ.6,632 నుంచి రూ.4,050కి తగ్గనున్న గృహ నిర్మాణ ఈఎంఐ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ‘2022 నాటికి అందరికీ ఇల్లు’ పథకాన్ని బుధవారం ప్రారంభించింది. పట్టణ  పేదలకు రుణాలపై వడ్డీ రాయితీని 6.50 శాతానికి పెంచేందుకు అంగీకరించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

రుణ రాయితీ పెంపు నిర్ణయం వల్ల పట్టణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాల వారికి ఒక్కొక్కరికి రూ. 2.30 లక్షల లబ్ధి చేకూరుతుందని,  నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ) రూ. 2,582 తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం వడ్డీ రేటు 10.50 శాతంగా ఉండగా.. రూ. 6 లక్షల రుణానికి 15 ఏళ్ల గడువుతో ఈఎంఐ నెలకు రూ. 6,632 గా ఉందని గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన విభాగ అధికారి ఒకరు చెప్పారు. రుణ అనుసంధానిత సబ్సిడీని 6.50 శాతంగా కేబినెట్ నిర్ణయించటంతో ఈ ఈఎంఐ రూ. 4,050కి తగ్గుతుందన్నారు.  

ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో రెండు కోట్ల కొత్త ఇళ్లు నిర్మించేందుకు ప్రారంభించిన జాతీయ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద రాబోయే ఏడేళ్లలో ఒక్కో లబ్ధిదారుడికి వివిధ రూపాల్లో రూ. 1 లక్ష నుంచి రూ. 2.30 లక్షల వరకూ కేంద్ర సాయం అందుతుందని తెలిపారు.కేంద్ర కేబినెట్ ఇదివరకు ఆమోదించిన ప్రకారం.. జాతీయ పట్టణ గృహనిర్మాణ పథకం కింద 4  రకాలుగా లబ్ధిదారుడికి కేంద్ర సాయం అందుతుంది.
పట్టణ గృహనిర్మాణ పథకాన్ని దేశంలోని 4,041 నగరాలు, పట్టణాలంటిలోనూ మూడు దశల్లో అమలు చేస్తారు. తొలుత.. 75 శాతం మంది పట్టణ జనాభా గల.. లక్ష మంది, అంతకన్నా ఎక్కువ జనాభా గల 500 నగరాలు, పట్టణాలపై కేంద్రీకరిస్తారు. రుణ అనుసంధానిత రాయితీ పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అన్ని నగరాలు, పట్టణాల్లో అమలు చేస్తారు.
పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకం కింద 30 చదరపు మీటర్ల కార్పెట్ ప్రాంతంలో ఇంటిని నిర్మించి, నీరు, మురుగునీటి పారుదల, రోడ్లు, విద్యుత్, టెలిఫోన్ లైన్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు; కమ్యూనిటీ సెంటర్లు, పార్కులు, ఆటస్థలాలు, జీవనోపాధి కేంద్రాలు వంటి సామాజిక సదుపాయాలను కల్పిస్తారు. ఈ పథకం కింద నిర్మించిన గృహాలను మహిళల పేర్ల మీద లేదా భార్యాభర్తలు ఇద్దరి పేర్ల మీదా రిజిస్టర్ చేస్తారు.
ఈ పథకం అమలుకు భూ వినియోగ మార్పిడి, లే-అవుట్ ప్రణాళికలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను సరళం చేయాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

కేబినెట్ భేటీలో నిర్ణయాలివీ..
జగదీశ్ చంద్రబోస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పేరుతో రక్షణ పరిశోధన కేంద్రాన్ని స్థాపించేందుకు.. పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన పాత నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ సంస్థకు చెందిన భవనం, భూమిలో కొంత భాగాన్ని డీఆర్‌డీఓకు బదిలీ చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
జాతీయ డయరీ అభివృద్ధి కార్యక్రమంలో మరో మూడు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను చేర్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే నేషనల్ డయరీ ప్రణాళిక-1ని మరో రెండేళ్లు- 2018-10 వరకూ పొడిగించింది.
సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదు రెట్లు పెంచింది. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సౌర కార్యక్రమం కింద 2022 నాటికి లక్ష మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం లక్ష్యంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
 
1వ విధానంలో..
భూమిని ఒక వనరుగా వినియోగించుకుంటూ ప్రయివేటు డెవలపర్ల భాగస్వామ్యంతో చేపట్టే పేదల వాడల (స్లమ్స్) పునరభివృద్ధి ప్రణాళిక కింద ప్రతి లబ్ధిదారుడికి సగటున రూ. 1 లక్ష మేర కేంద్ర గ్రాంటు అందిస్తారు. ఈ గ్రాంటును రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అవసరమైతే పేదల వాడల పునరభివృద్ధి పథకాలు వేటికైనా వినియోగించుకునే స్వేచ్ఛ ఉంది.
 
2వ విధానంలో..
రుణ అనుసంధానిత రాయితీ పథకం కింద అందుబాటు ధరలో ఉండే గృహ నిర్మాణానికి.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాల వారికి ప్రతి గృహ నిర్మాణ రుణంపైనా 6.50 శాతం వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
 
3వ విధానంలో..
ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే అందుబాటు ధరల్లోని గృహ నిర్మాణ పథకాల్లో.. 35 శాతం ఆవాసాలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కేటాయించేట్లయితే ఆయా పథకాల్లో ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.50 లక్షల చొప్పు న కేంద్ర సాయం అందిస్తారు.
 
4వ విధానంలో..
వ్యక్తిగత లబ్ధిదారుడే నిర్మించుకునే సొంత గృహ నిర్మాణానికి కానీ, సొంత ఇంటిని అభివృద్ధి చేసుకోవటానికి కానీ అర్హులైన పట్టణ పేదలు ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల కేంద్ర సాయం అందిస్తారు.

మరిన్ని వార్తలు