పవర్‌గ్రిడ్ ఎఫ్‌పీవోకు క్యాబినెట్ అనుమతి

8 Nov, 2013 01:20 IST|Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ దిగ్గజం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ మలి పబ్లిక్ ఇష్యూ(ఎఫ్‌పీవో)కు గురువారం ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం అనంతరం విద్యుత్ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌పీవో నిర్వహణకు ఎస్‌బీఐ క్యాప్స్, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌సహా ఐదు మర్చంట్ బ్యాంకర్ సంస్థలను సైతం ప్రభుత్వం ఎంపిక చేసింది.
 
 డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం మొత్తం 17% వాటాను విక్రయించనుంది. దీనిలో ప్రభుత్వ వాటా4%(18.51 కోట్ల షేర్లు) కాగా, మిగిలిన 13%(60.18 కోట్ల షేర్లు) వాటాను కంపెనీ కొత్తగా జారీ చేయనుంది. వీటిలో 2.4% షేర్లను ఉద్యోగులకు కంపెనీ కేటాయించనుంది.  ప్రస్తుత ధర ప్రకారం ఎఫ్‌పీవో ద్వారా కంపెనీకి రూ. 5,700 కోట్లు, కేంద్రానికి రూ. 1,700 కోట్లు చొప్పున లభించనున్నాయి. బీఎస్‌ఈలో గురువారం షేరు ధర 1.1% నష్టపోయి రూ. 95 వద్ద ముగిసింది. ఎఫ్‌పీవో తరువాత కంపెనీలో ప్రభుత్వ వాటా  57.89 శాతానికి పరిమితంకానుంది.  ఇంతక్రితం కూడా షేరుకి రూ. 90 ధరలో ప్రభుత్వం 2010 నవంబర్‌లో 10% వాటాను ఎఫ్‌పీవో ద్వారా విక్రయించింది.

మరిన్ని వార్తలు