వొడాఫోన్ ఇండియా.. ఇక బ్రిటిష్ కంపెనీ

7 Feb, 2014 01:05 IST|Sakshi
వొడాఫోన్ ఇండియా.. ఇక బ్రిటిష్ కంపెనీ

న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా సబ్సిడరీలోని మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను రూ.10,141 కోట్లతో కొనుగోలు చేయడానికి యునెటైడ్ కింగ్‌డమ్‌కు చెందిన వొడాఫోన్ గ్రూప్ చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశీయ టెలికం రంగంలో అతిపెద్ద ఏకమొత్తం విదేశీ పెట్టుబడి ఇదే. కొనుగోలు పూర్తయిన తర్వాత పూర్తిగా విదేశీ సంస్థ ఆధీనంలో ఉండే కంపెనీగా వొడాఫోన్ ఇండియా ఆవిర్భవించనుంది. వొడాఫోన్ గ్రూప్ ప్రతిపాదనను ఆమోదించినట్లు గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం అనంతరం ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు.

టెలికంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను అనుమతిస్తూ ప్రభుత్వం గతేడాది నిర్ణయించడం విదితమే. చందాదారుల సంఖ్య పరంగా దేశంలో రెండో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఇండియాలో ప్రస్తుతం 64.38% వాటా వొడాఫోన్ గ్రూప్‌నకు ఉంది. మైనారిటీ షేర్‌హోల్డర్లలో అజయ్ పిరమల్ వద్ద 10.97%, వొడాఫోన్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనల్జీత్ సింగ్ వద్ద 24.65% షేర్లున్నాయి. వీటి కొనుగోలుకు గాను అనల్జీత్ సింగ్‌కు రూ.1,241 కోట్లు, పిరమల్‌కు రూ.8,900 కోట్లను వొడాఫోన్ గ్రూప్ చెల్లించనుంది. పిరమల్‌కంటే ఎక్కువ వాటా వున్న అనల్జీత్‌కు బాగా తక్కువ మొత్తం చెల్లించడానికి సింగ్, వొడాఫోన్‌ల మధ్య ఒప్పందమే కారణం. సింగ్‌కు చెందిన మరో కంపెనీలో పరోక్షంగా వొడాఫోన్ పెట్టుబడి చేయడం దీని నేపథ్యం.

>
మరిన్ని వార్తలు